G20 Summit: జీ 20 ఖర్చులపై ముదురుతున్న వివాదం

G20 Summit:  జీ 20 ఖర్చులపై ముదురుతున్న వివాదం
తప్పుదారి పట్టించే ఆరోపణలన్న కేంద్రం

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా రెండు రోజుల పాటు నిర్వహించిన జీ-20 గ్రూపు సదస్సుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుపై పెద్దయెత్తున చర్చ కొనసాగుతోంది. సమావేశాల నిర్వహణ పేరుతో మోదీ సర్కార్‌ వేల కోట్ల రూపాయల ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. అవన్నీ తప్పుదారి పట్టించే వ్యాఖ్యలని స్పష్టం చేసింది. అధిక వ్యయాలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా ఖండించింది.

జీ20 సదస్సుకైన ఖర్చు గురించి తృణమూల కాంగ్రెస్ జాతీయ ప్రతినిధి గోఖలే సంచలన ఆరోపణలు చేశారు. గత కేంద్ర బడ్జెట్‌లో ఈ సదస్సు కోసం రూ.990 కోట్లు కేటాయించారని, కానీ వాస్తవానికి ప్రభుత్వం రూ.4100 కోట్లు ఖర్చుపెట్టిందని అన్నారు. ఇది బడ్జెట్ కేటాయింపుల కంటే 300 శాతం ఎక్కువ’ని వ్యాఖ్యానించారు.2024 ఎన్నికలే లక్ష్యంగా మోదీ వ్యక్తిగత ప్రచారం కోసం ఇదంతా ఖర్చు చేశారు కాబట్టి ఈ నిధులను బీజేపీ నుంచే ఎందుకు రాబట్టకూడదు అని గోఖలే ప్రశ్నించారు.


దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ సదస్సు కోసం కోట్ల రూపాయలను మంచి నీళ్ల ప్రాయంగా ఖర్చు పెట్టిందని, మోదీ సర్కార్‌ అవనసరపు అర్భాటాలకు పోయిందని సోషల్‌ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఢిల్లీని రంగు రంగుల లైట్లతో అలంకరించారని, భారీగా పెయింటింగ్‌లతో ముంచారని, అతిథులకు బంగారు, వెండి పాత్రలో వంటలు వడ్డించి, రాచ మర్యాదలు చేశారని మండిపడుతున్నారు. గత ఏడాది ఇండోనేషియాలో జీ20 సమావేశాలు జరుగ్గా.. ఆ దేశం రూ.364 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, ఇది మన దేశంలో మోదీ సర్కార్‌ పెట్టిన ఖర్చుకు ఇది సుదూరమని నెటిజన్లు విమర్శించారు.

ఆరోపణలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పందించింది. జీ20 సదస్సు కోసం బడ్జెట్ కేటాయింపులకు 300 శాతం అదనంగా ప్రభుత్వం ఖర్చు చేసినట్టు ఓ ట్వీ‌ట్‌లో పేర్కొన్న అంశం అవాస్తవమంది. అది ఖచ్చితంగా తప్పుదారి పట్టించేదని, అందులో పేర్కొన్న నిధులు ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ద్వారా శాశ్వత ఆస్తులు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసమే. కేవలం జీ20 సదస్సు కోసం కాదు అని పీఐబీ ట్వీట్ చేసింది.


Tags

Read MoreRead Less
Next Story