School Girl Heart Attack: 17 ఏళ్ల విద్యార్థినికి గుండె పోటు

School Girl Heart Attack:  17 ఏళ్ల విద్యార్థినికి గుండె పోటు
గుప్పెడంత గుండె ఆగిపోయింది ఎందుకో

17 ఏళ్ల యువతి గుండెపోటుతో మృతి చెందింది. పాఠశాలలో మెట్లు ఎక్కుతూ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడింది. ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టి అక్కడికక్కడే కుప్పకూలింది. తక్షణమే స్పందించిన స్కూల్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. గుజరాత్‌‌లో జరిగిన ఈ సంఘటన ఒకసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది.

నవ్‌సారి జిల్లాకు చెందిన తనీషా గాంధీ అక్కడి ఏబీ స్కూల్‌లో విశ్రాంతి సమయంలో స్నేహితులతో కలిసి మెట్లు ఎక్కుతుండగా ఒక్కసారిగా అసౌకర్యానికి గురైంది. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడింది. మెట్లను ఆనుకొని ఉన్న రెయిలింగ్‌ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ.. శరీరం సహకరించక కింద పడిపోయింది. ఏదో అనిజీగా ఉందని వారికి చెప్పేలోపే, విపరీతంగా చమటలు పట్టి స్పృహ కోల్పోయింది. స్కూల్ యాజమాన్యం ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆమె పాఠశాలలోనూ, కుటుంబంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. తనీషా రెండేళ్ల క్రితమే కోవిడ్ కారణంగా తల్లిని కోల్పోగా, ప్రస్తుతం తండ్రి సంరక్షణ లో ఉంటోంది. 17 సంవత్సరాలకే తనీషా ప్రాణాలు కోల్పోవడాన్ని ఆమె స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఇటీవల, గుజరాత్‌లో ఇలాంటి సంఘటనే జరిగింది ఇదే జిల్లాలో ఒక విద్యార్థి తన 12వ తరగతి పరీక్షకు 30 నిమిషాల ముందు గుండెపోటుతో మరణించాడు. విద్యాకుంజ్ పాఠశాలలో కామర్స్ విద్యార్థి ఉత్సవ్ షా పరీక్ష గదిలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్నప్పుడు ఛాతీలో సమస్య వచ్చింది.అతని తండ్రి నరేంద్ర షా అతనిని ఆసుపత్రికి తీసుకువెళ్లారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

అసలెందుకు ఈ గుండె పోట్లు?

ఒకప్పుడు 60-70 ఏండ్లు నిండిన వారిలోనే కనిపించిన గుండె సమస్యలు నేడు పాతికేళ్ల లోపు యువతలో కూడా బయటపడుతున్నాయి. వయసు పైబడిన వారిలో హృద్రోగ సమస్యలకు ఏదైనా ప్రత్యేకమైన కారణమంటూ ఉంటుంది. కానీ చిన్న వయసులో ఇబ్బందిపెట్టే హృద్రోగాలకు మానవ తప్పిదాలే మూలమని మరోసారి హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.

కొంత మందిలో పుట్టుకతో వచ్చే గుండె లోపాలు, వ్యాధులు మినహా యిస్తే, తక్కువ శారీరిక శ్రమ, ఎక్కువ మానసిక వత్తిడి, నాణ్యత లేని ఆహారం, సరైన పధ్ధతి లేని ఆహారపు అలవాట్లు ఈ మృతులకు కారణం కావచ్చు అని చెబుతున్నారు. శారీరక వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు, వయస్సుతో సంబంధం లేకుండా వైద్యపరీక్షలు నిర్వహించుకోవడం ద్వారా గుండెపోటు మరణాలను తగ్గించుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కోవిడ్ తరువాత రోగ నిరోధక శక్తి తగ్గడం ద్వారా గుండెపోట్లు పెరిగినట్లుగా పలు నివేదికలు చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story