Cloudburst: డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లు

Cloudburst: డెహ్రాడూన్‌లో క్లౌడ్ బరస్ట్.. కొట్టుకుపోయిన కార్లు, దుకాణాలు, ఇళ్లు
X
ఇద్దరు వ్యక్తులు గల్లంతు

ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. డెహ్రాడూన్‌లో మంగళవారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ కారణంగా వరదలు ముంచెత్తికొచ్చాయి. దీంతో కార్లు, దుకాణాలు కొట్టుకుపోయాయి. ఇళ్లులు ధ్వంసమయ్యాయి. అలాగే ఇద్దరు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.

మంగళవారం తెల్లవారుజామున ఒక్కసారిగా వరదలు ముంచెత్తికొచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం సహాయ చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. సంఘటనాస్థలికి జిల్లా మేజిస్ట్రేట్ సివాన్ బన్సాల్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ కుంకుమ్ జోషి, ఇతర అధికారులు చేరుకుని నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఇక గల్లంతైన వారి కోసం రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ప్రస్తుతం ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, పీడబ్ల్యూడీ అధికారులు బుల్డోజర్లతో యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. ఇక భారీ వర్షం కారణంగా డెహ్రాడూన్‌లోని 1-12 తరగతుల వరకు అన్ని పాఠశాలలు మూసివేసినట్లు జిల్లా మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఉత్తరకాశీలోని ధరాలి-హర్సిల్, చమోలిలోని తరాలి, రుద్రప్రయాగ్‌లోని చెనాగడ్, పౌరిలోని సైన్జీ, బాగేశ్వర్‌లోని కాప్‌కోట్, నైనిటాల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఏప్రిల్ నుంచి ఉత్తరాఖండ్‌లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా 85 మంది మరణించగా.. 128 మంది గాయపడ్డారు. 94 మంది తప్పిపోయారు. ఇక సెప్టెంబర్ 11న ప్రధాని మోడీ విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. డెహ్రాడూన్‌ను సందర్శించి రూ.1,200 కోట్ల ఆర్థిక సహాయ ప్యాకేజీని ప్రకటించారు.

Tags

Next Story