Jharkhand CM: విశ్వాస పరీక్షలో నెగ్గిన చంపయీ సోరెన్

జార్ఖండ్ అసెంబ్లీలో (Jharkhand Assembly) సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం చంపయీ సొరేన్ (CM Champai Soren) నేతృత్వంలోని జేఎంఎం కూటమి ప్రభుత్వం నెగ్గింది. 81 మంది ఎమ్మెల్యేలు ఉండే అసెంబ్లీలో చంపయీ సర్కార్ ప్రవేశపెట్టిన విశ్వాస పరీక్ష తీర్మానానికి అనుకూలంగా 47 మంది శాసనసభ్యులు ఓటు వేయగా.. ప్రతిపక్ష బీజేపీ (BJP) కూటమికి చెందిన 29 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు.
తీర్మానంపై ఓటింగ్‌కు అసెంబ్లీకి మొత్తం 77 మంది ఎమ్మెల్యేలు హాజరు కాగా, స్వతంత్ర ఎమ్మెల్యే సరయు రాజ్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. దీంతో అధికార జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమి బలపరీక్ష నెగ్గడంతో కూటమి ఎమ్మెల్యేల ఫిరాయింపు ఊహాగానాలకు తెరపడింది. ఈడీ కస్టడీలో ఉన్న మాజీ సీఎం హేమంత్ సొరేన్ కోర్టు అనుమతితో ఓటింగ్‌లో పాల్గొన్నారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం చంపయీ సొరేన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకొని హేమంత్ సొరేన్‌పై తప్పుడు కేసులు బనాయించిందని విమర్శించారు.
అసెంబ్లీలో హేమంత్ సోరేన్ మాట్లాడుతూ 8.5 ఎకరాల ప్లాట్‌కు సంబంధించి తనపై కేసు పెట్టారని, ఆ ప్లాట్ తన పేరు మీద ఉందని రుజువు చూపాలని బిజెపిని సవాల్ చేశారు. అలా చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. ఆదివాసీల కన్నీళ్లు వారికి పట్టవని, తాను ఏడవనని, సరైన సమయంలో వారి ప్రతి కుట్రకు సమాధానం చెబుతానని చెప్పారు. కోట్లు దోచుకుని విదేశాలకు పారిపోయిన వారిని వారు ఏమీ చేయలేరని, గిరిజనులను, అమాయకులను లక్ష్యంగా చేసుకోవడమే వారు చేయగలరని చెప్పారు. గిరిజనులు న్యాయమూర్తులుగా, ఐపిఎస్‌లుగా, ఐఎఎస్‌లుగా, నాయకులుగా ఎదగడం వారికి ఇష్టం లేదని అన్నారు. కుతంత్రాలతో విజయం సాధిస్తామని వారు భావిస్తున్నారని, కానీ జార్ఖండ్, గిరిజనులు, దళితులు త్యాగాలు చేసిన రాష్ట్రమని గుర్తు చేశారు.
హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్‌ను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలిశారు. రాష్ట్రంలో భారత్ జోడో న్యారు యాత్ర సందర్భంగా ఆమెతో సమావేశమయ్యారు. జెఎంఎం- కాంగ్రెస్ కూటమి బలపరీక్షలో నెగ్గిన తర్వాత రాహుల్‌గాంధీ ఆమెను కలిసినట్లు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com