సీఎం డిక్లరేషన్‌పై సర్వత్రా ఆసక్తి.. ఇస్తారా.. లేదా?

సీఎం డిక్లరేషన్‌పై సర్వత్రా ఆసక్తి.. ఇస్తారా.. లేదా?
తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతూనే ఉంది. ఎన్నో వివాదాల నడుమ సీఎం జగన్ ఇవాళ తిరుమలలో అడుగు పెట్టబోతున్నారు..

తిరుమలలో సీఎం జగన్ డిక్లరేషన్‌పై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతూనే ఉంది. ఎన్నో వివాదాల నడుమ సీఎం జగన్ ఇవాళ తిరుమలలో అడుగు పెట్టబోతున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం డిక్లరేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు విపక్షాలు మాత్రం.. డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనంటూ గట్టిగా పట్టుబట్టాయి. డిక్లరేషన్‌ ఇచ్చాకే జగన్‌ ఆలయంలో అడుగు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అన్యమతస్తుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించారు. జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో నిరసనలు తెలియజేయాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ముఖ్యమంత్రి జగన్‌ తిరుమల పర్యటన నేపథ్యంలో నిరసనలు తెలియజేయాలని పిలుపునిచ్చారు. నిరసనలకు సంబంధించి వారికి దిశానిర్దేశం చేశారు. అన్యమతస్తుడైన ముఖ్యమంత్రి డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటని ప్రశ్నించిన చంద్రబాబు.. డిక్లరేషన్‌ ఇచ్చాకే తిరుమల ఆలయంలో అడుగు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఒంటరిగా పట్టువస్త్రాలు ఇస్తే అతనికే కాదు, రాష్ట్రానికే అరిష్టమని అన్నారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

ఎన్నికల ముందేమో ఓట్ల కోసం హిందూ మతం స్వీకరించినట్లు డ్రామాలు ఆడి..గెలిచాక బైబిల్ పక్కన పెట్టుకుని ప్రమాణ స్వీకారాలా? అని చంద్రబాబు విమర్శించారు. ముఖ్యమంత్రి ఏ మతస్థుడైనా కావచ్చు.. అన్ని మతాలను సమ దృష్టితో చూడాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రార్థనా మందిరాలను కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉందన్నారు. టీడీపీ సెక్యులర్‌ పార్టీ అని.. ఆలయాలపై దాడులను, మత విద్వేషాలను ఎంత మాత్రం సహించబోమని అన్నారు చంద్రబాబు. ఇన్ని అరాచకాలు జరుగుతున్నా స్పందనలేని ముఖ్యమంత్రి ఎక్కడైనా ఉన్నాడా అని ప్రశ్నించారు.

ఆలయాలపై దాడులు జరిగితే నోరు తెరవరు.. దళితులపై దాడులు జరిగితే నోరు విప్పరంటూ ముఖ్యమంత్రి జగన్‌పై మండిపడ్డారు చంద్రబాబు. బీసీలపై తప్పుడు కేసులను ఖండించరు.. గిరిజనులు, ముస్లింలపై దౌర్జన్యాలను అడ్డుకోరంటూ ఫైరయ్యారు. మంత్రుల వ్యాఖ్యలకు సాధువులు కంటతడి పెట్టే దుస్థితి తెచ్చారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీతో పాటు.. బీజేపీ కూడా తిరుమలలో సీఎం జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. అందుకోసం జిల్లా వ్యాప్తంగా నిరసనలు తెలియజేయాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు పోలీసులు అప్రమత్తమయ్యారు. తిరుమల కొండతో పాటు.. జిల్లాలో భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Tags

Next Story