Kolkata: వైద్యుల నిరసన శిబిరానికి వెళ్లిన మమతా బెనర్జీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులతో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడారు. స్వయంగా ఆమే నిరసన శిబిరానికి వెళ్లడం గమనార్హం.
ఈ హత్యాచార ఘటనను నిరసిస్తూ పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్ భవన్’ ఎదుట జూనియర్ వైద్యులు గత నెల రోజులుగా ఆందోళన సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యాహ్నం నిరసన శిబిరానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం అని అన్నారు.
‘‘ఇక్కడికి ముఖ్యమంత్రిగా రాలేదు. మీ దీదీ (సోదరి)గా వచ్చా. ఎండావానల్లోనూ మీరు రోడ్లపై ఆందోళన చేస్తుంటే నేను ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. మీ డిమాండ్లను కచ్చితంగా అధ్యయనం చేస్తాం. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం. ఆర్జీ కర్ ఆసుపత్రిలో రోగుల సంరక్షణ కమిటీని రద్దు చేస్తున్నా’’ అని మమతా బెనర్జీ వెల్లడించారు.
ఇక, మరోవైపు.. నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యులపై దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సంచలన వ్యాఖ్యలు చేసింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు కొన్ని విపక్ష శక్తులు ట్రై చేస్తున్నాయని విమర్శలు గుప్పించింది. ఈ ఆరోపణలకు ఒక వీడియో క్లిప్‌ను రుజువుగా టీఎంసీ చూపించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య విభాగం ప్రాంగణం సమీపంలో పోలీసులు భద్రతను భారీగా పెంచేశారు. ఈ కుట్రతో ప్రమేయం ఉందని అనుమానిస్తోన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు పంపిచారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com