Siddaramaiah: సీఎం సీటు ఖాళీగా లేదు :ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
ముడా కుంభకోణం, ఇతర అవినీతి ఆరోపణల నేపథ్యంలో తనను పదవి నుంచి తొలగిస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఖండించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఖాళీగా లేదని, ఎలాంటి సందేహం లేకుండా తానే పూర్తి కాలం ఈ పదవిలో కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. ఎవరో ఆక్రమించుకోవడానికి కర్ణాటక సీఎం సీటు ఏమీ ఖాళీగా లేదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ముడా (మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) కుంభకోణం కలకలం సృష్టిస్తోంది. హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతోంది. ముడా కుంభకోణంపై విచారణ నేపథ్యంలో ఆయన సీఎం పదవి నుంచి వైదొలిగితే తదుపరి సీఎం ఎవరు అనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన స్పందించారు.
కర్ణాటకలో సీఎం పదవి ఖాళీగా లేదని, దీనిపై ఇంత వరకు ఎవరూ ప్రకటన కూడా చేయలేదన్నారు. సీఎం పదవి ఖాళీగా లేనప్పుడు ఇంకా కొత్తగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అని ప్రశ్నించారు. తానే సీఎంగా కొనసాగుతానని, ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదన్నారు.
రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాల్సి వస్తే సీఎం పదవికి పోటీ పడుతున్న మంత్రులు, సీనియర్లను కట్టడి చేయాలని రాహుల్ గాంధీకి పార్టీ నేతల బృందం లేఖ రాసింది. ఈ క్రమంలో మీడియా అడిగిన ప్రశ్నకు సిద్ధరామయ్య పైవిధంగా సమాధానం చెప్పారు. ముఖ్యమంత్రి పదవిపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టాలని కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంజునాథ్ భండారి, ఎమ్మెల్సీ దినేశ్ గూలిగౌడ... పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేను కోరారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com