ISRO | సీఎంఎస్03 ప్రయోగం సక్సెస్.. మరో ఘనత సాధించిందన్న ఇస్రో !

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. భారత నేవీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం CMS-03ను విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బాహుబలి రాకెట్ LVM3-M5 ద్వారా ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు.
నిర్ణీత సమయానికి నింగిలోకి దూసుకెళ్లిన LVM3-M5 రాకెట్, CMS-03 ఉపగ్రహాన్ని కచ్చితత్వంతో నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం రాకెట్ నుంచి ఉపగ్రహం విజయవంతంగా విడిపోయిందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ ప్రయోగం సంపూర్ణ విజయం సాధించిందని, ఇంజెక్షన్ ప్రక్రియ కచ్చితంగా జరిగిందని వారు తెలిపారు.
GSAT-7Rగా కూడా పిలిచే ఈ CMS-03 ఉపగ్రహం, భారత నావికాదళానికి ఇప్పటివరకు ఉన్నవాటిలో అత్యంత ఆధునికమైనది. ఇది నేవీ యొక్క అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థను, సముద్ర జలాలపై నిఘా సామర్థ్యాన్ని గణనీయంగా బలోపేతం చేయనుంది. నావికాదళం కార్యాచరణ అవసరాలకు తగినట్లుగా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అనేక అత్యాధునిక భాగాలను ఇందులో అమర్చారు. CMS-03 భారతదేశం, చుట్టుపక్కల సముద్ర ప్రాంతాలకు మల్టీ-బ్యాండ్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి రూపుదిద్దుకుంది. LVM3, లేదా GSLV Mk-III అని కూడా పిలుస్తారు. ఇది ISRO యొక్క కొత్త హెవీ-లిఫ్ట్ లాంచ్ వెహికల్. ఈ రాకెట్ 4,000 కిలోల వరకు బరువున్న ఉపగ్రహాలను GTO లోకి, 8,000 కిలోల వరకు తక్కువ భూమి కక్ష్యలోకి ( LEO) ప్రవేశపెట్టగలదు. ఇది మూడు-దశల రాకెట్: రెండు ఘన మోటార్ స్ట్రాప్-ఆన్‌లు ( S200), ఒక ద్రవ-చోదక కోర్ దశ ( L110), ఒక క్రయోజెనిక్ దశ ( C25) . దీనిని పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు.
సుమారు 4,400 కిలోల బరువున్న ఈ శాటిలైట్, భారతదేశం ప్రయోగించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలలో అత్యంత బరువైనది కావడం విశేషం. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశ రక్షణ వ్యవస్థలో మరో కీలక ముందడుగు పడినట్లయింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

