Social Media Weight Loss Tip: విద్యార్థి ప్రాణం తీసిన సోషల్ మీడియా టిప్.

Social Media Weight Loss Tip: విద్యార్థి ప్రాణం తీసిన సోషల్ మీడియా టిప్.
X
విషాదం.. బోరాక్స్‌ తిని కాలేజీ విద్యార్థిని మృతి..

ఈమధ్య కాలంలో ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి చిట్కాలు కావాలన్నా వెంటనే సోషల్ మీడియా ఓపెన్ చేసి మనకు కావాల్సిన సమాచారం గురించి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా బరువు పెరగాలన్నా, తగ్గాలన్నా అవే వీడియోలను చూస్తూ.. వారి చెప్పిందల్లా చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అచ్చంగా ఇలాంటి పిచ్చి పనే చేసిందో 19 ఏళ్ల అమ్మాయి. బరువు తగ్గాలంటే బోరాక్స్ పౌడర్ తినాలని చెప్పిన ఓ వీడియో చూసి అదే పని చేయగా.. ప్రాణాలు కోల్పోయింది. మదురై జిల్లా సెల్లూరు పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే..?

మీనాంబల్‌పురానికి చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్ కుమార్తె 19 ఏళ్ల కలైయరసి.. నారిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కొంత కాలంగా అధిక బరువుతో బాధ పడుతోంది. అయితే ఎలాగైనా సరే బరువు తగ్గాలని నిర్ణయించుకున్న ఆమె.. సోషల్ మీడియాలో చిట్కాలు వెతకడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే గత వారం యూట్యూబ్‌లో.. శరీరంలోని కొవ్వును కరిగించి స్లిమ్‌గా మార్చే వెంకారమ్ (బోరాక్స్) అనే పేరుతో ఉన్న ఒక వీడియో ఆమె కంటపడింది.

వీడియోలో చెప్పిన మాటలను నిజమని నమ్మిన కలైయరసి.. జనవరి 16వ తేదీన స్థానిక నాటు మందుల దుకాణం నుంచి వెంకారమ్ (బోరాక్స్ పౌడర్) కొనుగోలు చేసింది. మరుసటి రోజు అంటే జనవరి 17వ తేదీన యూట్యూబ్ వీడియోలో సూచించిన విధంగా ఆ పొడిని సేవించింది. అయితే అది తిన్న కొద్ది సేపటికే ఆమెకు తీవ్రమైన వాంతులు, విరేచనాలు మొదలు అయ్యాయి. కంగారుపడిన తల్లి వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు ప్రాథమిక చికిత్స చేసి ఇంటికి పంపించారు. కానీ సాయంత్రానికి ఆమె పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. తీవ్రమైన కడుపు నొప్పి, మలంలో రక్తం పడటంతో ఆమె విలవిల్లాడిపోయింది. తన తండ్రిని పట్టుకుని ఏడుస్తూ నరకయాతన అనుభవించింది.

రాత్రి 11 గంటల సమయంలో పరిస్థితి పూర్తిగా విషమించడంతో.. ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆమెను ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆసుపత్రికి చేరుకునే లోపే కలైయరసి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సాధారణంగా బోరాక్స్‌ పౌడర్‌ను శుభ్రపరిచే రసాయనంగా ఉపయోగిస్తారు. ఇది మనుషులు తీసుకోవడం వల్ల అంతర్గత అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కలైయరసి విషయంలోనూ అదే జరిగింది. ఫలితంగా ఆమె ప్రాణాలు కోల్పోయింది. అయితే పోస్టుమార్టం అనంతరం వైద్యులు కలైయరసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సోషల్ మీడియా చిట్కాలపై హెచ్చరిక..

ఈ ఘటన నేపథ్యంలో వైద్య నిపుణులు, పోలీసులు ప్రజలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వేదికల్లో వచ్చే అరకొర వైద్య చిట్కాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించవద్దిన సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నా లేదా బరువు తగ్గాలని భావించిన సర్టిఫైడ్ డాక్టర్ లేదా డైటీషియన్‌ను మాత్రమే సంప్రదించాలని సూచించారు. సోషల్ మీడియాలో పెట్టే వీడియోలు.. వ్యూస్ కోసం తప్పుడు సమాచారాన్ని సైతం అందిస్తాయనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు.

Tags

Next Story