CM Siddaramaiah: చిక్కుల్లో కన్నడ సీఎం

కర్ణాటక రాజకీయాల్లో మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) భూకుంభకోణం ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఈ స్కామ్‌కు సంబంధించి సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి, ఆమె సోదరుడు మల్లికార్జున్, మరో వ్యక్తిపై స్నేహమయి కృష్ణ అనే సామాజిక కార్యకర్త మైసూర్‌లోని విజయనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధరామయ్య, పార్వతి, ముడా అధికారులతోపాటు మైసూర్ జిల్లా కలెక్టర్, పలువురు ఇతర ప్రభుత్వ అధికారులకు భూ కేటాయింపు కుంభకోణంలో పాత్ర ఉన్నదని ఆరోపించారు. ఇందుకు రెవెన్యూ, ఇతర అధికారులు సహకరించారని ఆరోపించారు. భూ కేటాయింపు వివాదంపై దర్యాప్తు చేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ కార్యదర్శిలకు కూడా స్నేహమయి కృష్ణ లేఖ రాశారు. అయితే ఈ భూ కేటాయింపులు బీజేపీ హయాంలోనే జరిగాయని సీఎం సిద్ధరామయ్య అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.
బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణల ప్రకారం.. మైసూరు నగర శివార్లలోని గ్రామీణ ప్రాంతాల్లో సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతమ్మకు 3 ఎకరాల 16 గుంటల భూమి ఉంది. అయితే ఆ భూములను సేకరించిన కర్ణాటక ప్రభుత్వం.. వాటికి బదులుగా మైసూరు నగరంలోపల అత్యంత ఖరీదైన ప్రాంతాలైన విజయనగర్, దట్టగల్లీ, జేపీ నగర్, ఆర్టీ నగర్, హంచయా-సతాగల్లీలో.. భూములను కేటాయించింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎకరం భూమిని ప్రభుత్వం సేకరిస్తే.. నగరంలో అర ఎకరం భూమిని కేటాయించారు. అయితే ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భూములను కేటాయించాలని ఎవరు సిఫారసు చేశారని బీజేపీ నేత ఆర్ అశోక్ ప్రశ్నించారు. మంత్రివర్గం అనుమతి లేకుండా భూములు కేటాయించే అధికారం ఎవరికి ఉంటుందని.. ముఖ్యమంత్రికి తెలియకుండానే ఇంత భారీ కుంభకోణం జరిగిందా అని నిలదీశారు.
అయితే ముడా భూ కుంభకోణం గురించి బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఆరోపణలను ఖండించిన ముఖ్యమంత్రి.. తమ కుటుంబానికి ఆ భూములను ఎవరు, ఎలా కేటాయించారో తనకు తెలియదని వెల్లడించారు. అయితే ఈ భూ కేటాయింపులు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు తెలిపారు. రింగ్‌రోడ్డుకు సమీపంలో తన భార్య పేరుమీద 3.16 ఎకరాల భూమి ఉన్నది నిజమేనని పేర్కొన్నారు. తమ భూమిని సేకరించకుండానే ముడా అధికారులు అక్కడ లే అవుట్ వేసి.. లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వివరించారు. చట్ట ప్రకారం తమ భూములకు బదులుగా వేరేచోట భూములు ఇస్తామని ముడా అంగీకరించిందని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇదంతా బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని స్పష్టం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com