Pahalgam Terror Attack: జమ్మూకాశ్మీర్‌లో భారీ నిరసనలు

పహల్గామ్ మారణహోమానికి నిరసనగా జమ్మూకాశ్మీర్‌లో సంపూర్ణ బంద్ కొనసాగుతోంది. రోడ్లపైకి వచ్చి నిరసనలు కొనసాగిస్తున్నారు. స్వచ్చంధంగా దుకాణాలు మూసేసి.. నిరసనల్లో పాల్గొంటున్నారు. కాశ్మీరీలు ఐక్యతా నినాదాలతో భారత సైన్యానికి మద్దతు ఇస్తున్నారు. ప్రస్తుతం దుకాణాలు, హోటళ్లు మూతపడ్డాయి. హిందూస్తాన్ జిందాబాద్ అంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ‘నేను భారతీయుడినే’ అంటూ నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్నారు. భారత సైన్యానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతు ప్రకటించాయి. ప్రజలు నిరసనల్లో పాల్గోవాలంటూ మసీదుల్లో లౌడ్ స్పీకర్ల ద్వారా పిలుపునిస్తున్నారు. మార్కెట్లు అన్ని మూసేయాలని కోరారు. బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెల్పడంతో.. 35 ఏళ్ల కాలంలో లోయలో బంద్ పాటించడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
ఇక ఉగ్రమూకల కాల్పుల్లో పర్యాటకులకు గుర్రపు స్వారీలు అందించే సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కూడా ప్రాణాలు వదిలాడు. ఉగ్రవాదుల చేతుల్లోంచి తుపాకీలు లాక్కునే ప్రయత్నం చేసి పలువురి ప్రాణాలు కాపాడాడు. చివరికి ముష్కరుల తూటాలకు సయ్యద్ బలైపోయాడు.
ఇక జమ్మూకాశ్మీర్‌లో చిక్కుకున్న పర్యాటకులకు 15 రోజులు ఉచితంగా బస ఏర్పాటు చేస్తామని హోటళ్ల యజమాని ఆసిఫ్ బుర్జా తెలిపారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదని.. ఇది మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించాడు. సిగ్గుతో మా తలలు వేలాడుతున్నాయని ఆసిఫ్ బుర్జా పేర్కొన్నారు. టూరిస్టులకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే భారత సైన్యానికి అండగా ఉంటామని ప్రకటించారు.
మంగవారం మధ్యాహ్నం పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు విదేశీయులతో పాటు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. భౌతికకాయాలను స్వస్థలాలకు అధికారులు తరలించారు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు నివాళులర్పిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com