Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ నిర్ధారణ..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Monkeypox: దేశంలో మంకీపాక్స్‌ నిర్ధారణ..కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
హెల్త్ ఎమర్జెన్సీ అవసరంలేదని ప్రకటించిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ

భారత్‌లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ సోకిందని వెల్లడించింది. ఆదివారం అనుమానిత కేసుగా భావించిన వ్యక్తికి వ్యాధి నిర్ధారణ అయిందని, నమూనాలను సేకరించి పరీక్షించినట్టు వివరించింది. ప్రయాణ సమయంలో సోకిన కేసుగా నిర్ధారించినట్టు పేర్కొంది. నమూనాలు సేకరించి ప్రయోగశాలలో పరీక్షించగా రోగిలో పశ్చిమ ఆఫ్రికా క్లాడ్-2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది.

ఈ ఎంపాక్స్ కేసు నిర్ధారణపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. బాధితుడు ఒక యువకుడు అని, ఎంపాక్స్ వ్యాప్తిని ఎదుర్కొంటున్న ఒక దేశానికి ఇటీవల ప్రయాణించాడని పేర్కొంది. మూడంచెల సంరక్షణ సదుపాయాలు ఉన్న ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని, బహుళ అనారోగ్య సమస్యలు ఏమీ ఉత్పన్నం కాలేదని వివరించింది. కాగా రోగి పేరును కేంద్రం వెల్లడించలేదు.

దేశంలో గతంలో నమోదైన మంకీపాక్స్ కేసుల మాదిరిగా ఇది కూడా ఐసోలేట్ కేసు అని, హెల్త్ ఎమర్జెన్సీ అవసరం లేదని తెలిపింది. జులై 2022 నుంచి దేశంలో 30 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయని, ఇది కూడా వాటి మాదిరేనని స్పష్టం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ కేసు పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో భాగం కాదని తెలిపింది. ఎంపాక్స్‌ వైరస్‌కు సంబంధించి.. ప్రస్తుతం మనదేశంలో ప్రజలకు ఎలాంటి ముప్పూ లేదని, వైరస్‌ వ్యాప్తిపై నిరంతరం పర్యవేక్షణ జరుపుతున్నామని వెల్లడించింది. ఆఫ్రికాలోని పలు దేశాల్లో ఎంపాక్స్‌ రెండో వేవ్‌ మొదలవ్వటంతో, ప్రజా ఆరోగ్యంపై గత నెలలో డబ్ల్యూహెచ్‌వో అంతర్జాతీయంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మరోవైపు, మంకీపాక్స్‌పై రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఎంపాక్స్‌ అనుమానిత కేసుల స్క్రీనింగ్‌, టెస్టింగ్‌లను నిర్వహించాలని, అలాగే వ్యాధి నిర్ధారిత, అనుమానిత రోగులకు అవసరమయ్యే ఐసొలేషన్‌ సౌకర్యాలు కల్పించాలని అడ్వైజరీ జారీ చేసింది. ప్రజల్లో ఎలాంటి భయాందోళనలకు తావివ్వకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరింది.

Tags

Next Story