No Confidence Motion: కేంద్రంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవిశ్వాస నోటీస్‌

No Confidence Motion: కేంద్రంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ అవిశ్వాస నోటీస్‌
లోక్‌సభలో అవిశ్వాస నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌... ప్రధాని మోదీ సమాధానం చెప్పేందుకు ఇదే మార్గమన్న ప్రతిపక్షాలు

లోక్‌సభ(Lok Sabha)లో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌(Congress), బీఆర్‌ఎస్‌(BRS) పార్టీలు అవిశ్వాస తీర్మానం(No Confidence Motion) ఇచ్చాయి. రూల్ 198 కింద కాంగ్రెస్‌ ఎంపీ గ‌గోయ్ , బీఆర్‌ఎస్‌ ఎంపీ(BRS MP) నామా నాగేశ్వరరావు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చారు. మ‌ణిపూర్ అంశంపై కేంద్ర ప్రభుత్వ విధానాలు దారుణంగా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు(Opposition MPs) మండిపడుతున్నాయి. మ‌ణిపుర్(MANIPUR) అంశంపై చ‌ర్చకు ప్రధాని మోదీ ముఖం చాటేయ‌డం వ‌ల్ల .. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ‌పెట్టాల్సి వచ్చిందని విపక్షాలు వెల్లడించాయి. పార్లమెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మై నాలుగు రోజులు గ‌డిచినా స‌భ స‌జావుగా సాగ‌డం లేదని... మణిపుర్‌ ప్రధాని మోదీ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి.


లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ బలముందని తమకు తెలుసని.. కానీ మణిపుర్‌ హింసాకాండపై ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సమాధానం కోరేందుకు అవిశ్వాస తీర్మానం( No Confidence Motion) ఒక మార్గమని ప్రతిపక్ష ఎంపీలు అన్నారు. ఈ అవిశ్వాస తీర్మానం రాజకీయ ఎత్తుగడని, ఇది ఫలితాలనిస్తుందని కాంగ్రెస్‌ ఎంపీ గగోయ్‌ తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో ప్రధాని సభకు తప్పక రావాల్సి ఉంటుందని, దేశ సమస్యలపై, మణిపుర్‌పై పార్లమెంటు లోపల చర్చ జరుగుతుందని విపక్షాలు భావిస్తున్నాయి.

ఇండియా కూటమి కలిసే ఉందని, అవిశ్వాస తీర్మానం ఆలోచనను ప్రతిపాదించిందని లోక్‌సభలో కాంగ్రెస్ విప్ మాణికం ఠాగూర్ తెలిపారు. మోదీ అహంకారాన్ని ఈ అవిశ్వాస తీర్మానంతో విచ్చినం చేస్తామని ఆయన వెల్లడించారు. కొన్ని పార్లమెంటరీ విధానాలు సుదీర్ఘంగా చర్చ జరపడానికి, సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వానికి తప్పని పరిస్థితిని కల్పిస్తాయని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు.

లోక్‌సభలో ఏ సభ్యుడైనా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు. లోక్‌సభ విధి విధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ 198 అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టే విధానాన్ని నిర్దేశిస్తుంది. ఉదయం 10 గంటలలోపు సభ్యుడు తీర్మానంపై లిఖితపూర్వక నోటీసు ఇవ్వాలి. కనీసం 50 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. దానిని స్పీకర్ సభలో చదవి... తీర్మానంపై చర్చకు తేదీని ప్రకటిస్తారు. తీర్మానాన్ని ఆమోదించిన రోజు నుంచి 10 రోజుల్లోపు చర్చకు తేదీని నిర్ణయించాలి. సభలో ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేకపోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది. లోక్‌సభలో ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా... ఐదు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీఏకు 330 మందికి పైగా సభ్యుల బలం ఉంది. విపక్ష ఇండియా ఫ్రంట్‌కు 140 మందికి పైగా ఎంపీలు ఉన్నారు. 60 మందికిపైగా సభ్యులు తటస్థంగా ఉన్నారు..

Tags

Read MoreRead Less
Next Story