Operation Sindoor: కాంగ్రెస్‌ చెప్పకున్నా శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్రం

Operation Sindoor: కాంగ్రెస్‌ చెప్పకున్నా శశిథరూర్‌ను ఎంపిక చేసిన కేంద్రం
X
కాంగ్రెస్‌ పంపిన జాబితాలో పేరు లేకున్నా..

పాకిస్థాన్‌ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను కేంద్రం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు వివిధ రాజకీయ పార్టీల ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది. వీరిలో కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నాయకుడు శశిథరూర్‌ ఉన్నారు. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు కోరిక మేరకు ఆయా పార్టీలు తమ నేతల పేర్లను ప్రభుత్వానికి పంపారు.

అయితే, కాంగ్రెస్‌ పంపిన లిస్ట్‌లో శశిథరూర్‌ పేరు లేకపోయినా అనూహ్యంగా ఆయనను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేశ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. నిన్న ఉదయం (మే 16) పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజు.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌తో మాట్లాడినట్లు చెప్పారు. పాక్‌ ఉగ్రవాదంపై భారత్‌ వైఖరిని ప్రపంచదేశాలకు వివరించేందుకు విదేశాలకు పంపే ప్రతినిధుల బృందాలకు నలుగురు ఎంపీల పేర్లను ప్రతిపాదించాలని కోరినట్లు చెప్పారు. ఆయన విజ్ఞప్తి మేరకు నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్‌ పార్టీ ఆనంద్‌ శర్మ, గౌరవ్‌ గొగోయ్‌, డాక్టర్‌ సయ్యద్‌ నసీర్‌ హుస్సేన్‌, రాజ బ్రార్‌ పేర్లను పంపినట్లు చెప్పారు. కాంగ్రెస్‌ పంపిన ప్రతిపాదనలో థరూర్‌ పేరు లేదని వెల్లడించారు. అయితే, కేంద్రం అనూహ్యంగా ఆయన్ని ఎంపిక చేసిందంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

ఏడుగురు ప్రతినిధుల బృందం ఇదే..

ఆపరేషన్‌ సిందూర్ తర్వాత దాయాది దేశం పాకిస్థాన్‌తో భారత్‌ దౌత్య యుద్ధానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉగ్రవాదానికి, ఉగ్రవాదుల తయారీకి ఫ్యాక్టరీగా మారిన పాకిస్థాన్‌పై తీసుకుంటున్న దౌత్య చర్యల్లో భాగంగా విదేశాలకు భారత ప్రతినిధి బృందాలను పంపేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పాక్‌ ఉగ్ర కుట్రలను ప్రపంచదేశాలకు వివరించడం కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే ఏడుగురు ఎంపీల పేర్లను శనివారం ప్రకటించింది.

ఎంపీలు శశిథరూర్‌ (కాంగ్రెస్‌), రవిశంకర్‌ ప్రసాద్ ‌(బీజేపీ), బైజయంత్‌ పాండా (బీజేపీ) సంజయ్‌ కుమార్‌ ఝా(జేడీయూ), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ -ఎస్పీ), శ్రీకాంత్‌ శిందే (శివసేన) విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీరి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన మొత్తం ఏడు గ్రూపులు 10 రోజుల వ్యవధిలో ఐదు దేశాలకు వెళ్తాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ శనివారం అధికారికంగా ప్రకటించింది.

Tags

Next Story