Sachin Pilot: సచిన్ పైలట్-సారా అబ్దుల్లా విడాకులు..

కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ తన భార్య సారా అబ్దుల్లాకు విడాకులు ఇచ్చారు. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది. సారా అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కుమార్తె. సచిన్ పైలట్, సారా అబ్దుల్లా 2004లో వివాహం చేసుకున్నారు. నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్ 31) సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. దీంతోనే ఆయన విడాకులు తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో జీవిత భాగస్వామితో విడాకులు తీసుకున్నట్లు రాసి ఉంది.
సచిన్ పైలట్, సారా అబ్దుల్లాలకు ఇద్దరు కుమారులు. వారి పేర్లు అరన్ పైలట్, విహాన్ పైలట్. ఎన్నికల అఫిడవిట్‌లో తన కుమారులను డిపెండెంట్లుగా సచిన్ పైలట్ పేర్కొన్నారు. దీంతో సారా అబ్దుల్లా మాత్రమే సచిన్ పైలట్ నుంచి విడిపోయారని.. ఆయన కుమారులు మాత్రం వెంటే ఉన్నారని అర్థం అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌లో జన్మించిన సచిన్ పైలట్.. సెయింట్ స్టీఫెన్స్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ వరకు చదివారు. ఆ తర్వాత లండన్‌లోని పెన్సిల్వేనియా యూనివర్సిటీలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. అయితే 1990 వరకు జమ్మూ కాశ్మీర్‌లోనే నివసించిన సారా అబ్దుల్లా.. ఆ తర్వాత కాశ్మీర్‌లో జరిగిన ఉద్రిక్తతల కారణంగా సారా అబ్దుల్లాను ఆమె తల్లిని ఫరూక్ అబ్దుల్లా లండన్‌కు పంపించారు. అక్కడే సచిన్ పైలట్, సారా అబ్దుల్లా మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత భారత్‌కు వచ్చి పెళ్లి చేసుకుంటామని చెప్పగా.. రెండు కుటుంబాలు అంగీకరించలేదు.
గుజ్జర్‌ల కుటుంబం నుంచి వచ్చిన సచిన్ పైలట్, ముస్లిం కుటుంబం నుంచి వచ్చిన సారా అబ్దుల్లా.. పెళ్లి కోసం కొన్ని నెలల తరబడి వేచి చూశారు. దీంతో ఎలాంటి అంగీకారం లభించకపోవడంతో 2004 జనవరిలో సచిన్ పైలట్, సారా అబ్దుల్లా పెళ్లి చేసుకున్నారు. అతి తక్కువ మంది అతిథుల మధ్య ఈ పెళ్లి నిర్వహించారు. ఈ వివాహాన్ని మొదట బహిష్కరించిన అబ్దుల్లా కుటుంబం.. తర్వాత కుమార్తెకు దగ్గరయ్యారు. ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులకే సచిన్ పైలట్ కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com