Himanta Sarma: కాంగ్రెస్ మేనిఫెస్టో ఆ దేశానికే : అస్సాం సీఎం హిమంత

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విడుదలచేసిన మేనిఫెస్టోపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విమర్శ నాస్త్రాలు సంధించారు. ఆ మేనిఫెస్టో భారత్ కంటే పాకిస్థాన్‌లో ఎన్నికలకు సరిగ్గా సరిపోతుందన్నారు. అధికారంలోకి రావడానికి సమాజాన్ని విభజించాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆరోపించారు. ఇది బుజ్జగింపు రాజకీయమని విమర్శించారు.
దేశంలో ఏ వ్యక్తయినా, అది హిందువైనా, ముస్లిమైనా ట్రిపుల్ తలాక్ పునరుద్ధరణ కోరుకోరని, బాల్య వివాహాలు, బహుభార్యత్వానికి మద్దతునివ్వరని చెప్పారు. సమాజాన్ని విభజించి అధికారంలోకి రావాలనే మనస్తత్వం కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో అస్సాంలోని 14 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందన్నారు.
కాగా, హిమంత ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. లౌకిక, సమ్మిళిత తత్వాన్ని బీజేపీ అర్థం చేసుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. సమాజంలో అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడటమే తమ మేనిఫెస్టో లక్ష్యమని పేర్కొంది. పాంచ్ న్యాయ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. రైతులకు ఎంఎస్పీ కల్పించడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం కన్నాపెంపునకు రాజ్యంగా సవరణ, దేశవ్యాప్తంగా కులగణణ, అగ్నిపథ్ రద్దు వంటి హామీలను ఇచ్చింది.
హిమంత 2015లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు.. ‘హిమంత ఏళ్ల తరబడి కాంగ్రెస్ ఉన్నప్పటికి.. పార్టీ విలువలు అర్థం చేసుకోలేదు.. అందుకే బీజేపీలో చేరి.. కేవలం తన నిజాయితీని చాటుకోవటం కోసమే కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని అస్సాం కాంగ్రెస్ అధికార ప్రతినిధి బేదబ్రతా బోరా ఎద్దేవా చేశారు. అయితే, అస్సాంలో మూడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com