Rahul Gandhi: నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర

Rahul Gandhi: నేడు బీహార్‌లోకి ప్రవేశించనున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర
అధికారం కోల్పోయిన మరుసటి రోజే బీహార్‌ కు రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర నేడు బీహార్‌లోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మరుసటి రోజే ఆయన బీహార్‌కు రానుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఆర్జేడీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌ ఆధ్వర్యంలోని మహఘట్‌బంధన్‌ కూటమి నుంచి సీఎం నితీశ్‌ కుమార్‌ ఆదివారం వెలుపలికి వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీతో మరోసారి చేతులుకలిపిన ఆయన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

రెండు రోజుల విరామం తరువాత బెంగాల్‌లో రాహుల్‌ భారత్‌ జోడో న్యాయ్‌యాత్ర 28న తిరిగి ప్రారంభమయ్యింది. రాహుల్‌ యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే బెంగాల్‌ సీఎం మమతకు లేఖ రాశారు. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండు రోజుల విరామం తరువాత పశ్చిమ బెంగాల్‎లో మళ్లీ ప్రారంభమయ్యింది. బెంగాల్‌లోని జల్‌పాయిగురి జిల్లా నుంచి యాత్ర తిరిగి మొదలయ్యింది. సిలిగురిలో రాహుల్ గాంధీ థానా మోర్ నుంచి ఎయిర్ వ్యూ మోర్ వరకు ర్యాలీ నిర్వహించి తరువాత సభలో పాల్గొన్నారు రాహుల్‌.


భారత్ జోడో న్యాయ యాత్రకు తగిన భద్రత కల్పించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లేఖ చేశారు. రాష్ట్రంలో యాత్ర సజావుగా జరిగేలా చూడాలని కోరారు. జల్‌పాయ్‌గురిలో రాహుల్‌ జోడో యాత్ర బ్యానర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు చించేయడంపై కాంగ్రెస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణలో బీసీ కులగణన చేపట్టాలన్న సీఎం రేవంత్‌ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు రాహుల్‌. సామాజిక న్యాయానికి కాంగ్రెస్‌ కట్టుబడి ఉందని ట్వీట్‌ చేశారు.

భారత్ జోడో న్యాయ యాత్ర జనవరి 14న మణిపూర్ నుంచి ప్రారంభమైంది. నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం మీదుగా యాత్ర గురువారం పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. అయితే బెంగాల్ చేరుకున్న తర్వాత భారత్ జోడో న్యాయ్ యాత్రకు విరామం ఇచ్చిన రాహుల్ న్యూఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. బెంగాల్‌ లోని జల్‌పాయ్‌గురి నుంచి యాత్ర తిరిగి ప్రారంభమయ్యింది. ట్రావెల్ బస్సులో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలోని సోనాపూర్‌కు చేరుకున్నారు రాహుల్‌. రాత్రి అక్కడ శిబిరంలో విశ్రాంతి తీసుకుంటారు.

ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన రాహుల్‌.. ఆ తర్వాత బీహార్‌ రాష్ట్రానికి రావడం ఇదే మొదటిసారి. సోమవారం మధ్యాహ్నం కిషాన్‌గంజ్ మీదుగా జోడో యాత్ర బీహార్‌లోకి ప్రవేశిస్తుంది. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఆ జిల్లా ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్నది. భారీ ర్యాలీ అనంతరం ఈ రోజు సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్‌ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఆయన ఏవిధంగా స్పందిస్తారనే విషయమై చర్చ నడుస్తున్నది.


Tags

Read MoreRead Less
Next Story