Kharge: కాంగ్రెస్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

Kharge: కాంగ్రెస్‌ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
X
పీఎం పదవిపై కాంగ్రెస్‌కు ఆసక్తి లేదన్న మల్లికార్జున ఖర్గే.... స్వప్రయోజనాల కోసం అధికారం దక్కించుకోవడం తమ ఉద్దేశం కాదని స్పష్టీకరణ

కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రి పదవిపై ఆసక్తి లేదని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) స్పష్టం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించేందుకు ఏర్పాటైన విపక్షాల సమావేశంలో (Opposition Meeting) రెండో రోజు ఖర్గే ప్రారంభోపన్యాసం చేశారు. స్వప్రయోజనాల కోసం అధికారాన్ని దక్కించుకోవడం తమ ఉద్దేశం కాదన్నారు. అధికారంపైనా లేదా ప్రధానమంత్రి పదవిపైనా కాంగ్రెస్‌ పార్టీకి ఆసక్తి లేదని ఖర్గే తేల్చి చెప్పారు. అధికారంలోకి రావడం తమ ఉద్దేశం కాదని.. కేవలం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికత్వాన్ని, సామాజిక న్యాయాన్ని పరిరక్షించడమే తమ ధ్యేయమన్నారు.


తాము అధికారంలోకి రావడం ఈ సమావేశం ఉద్దేశం కాదన్న ఖర్గే.. రాష్ట్ర స్థాయిలో తమలో కొన్ని విభేదాలున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. రాష్ట్ర స్థాయిలో విపక్షాల మధ్య విభేదాలున్నా.. సిద్ధాంతపరంగా ఐక్యంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు మిత్రపక్షాలను వాడుకున్న భాజపా.. ఆ తర్వాత వాటిని పక్కన బెట్టిందన్నారు. ఇవేవీ దేశం ఎదుర్కొంటున్న సమస్యల ముందు పెద్ద విషయాలు కావని ఖర్గే పేర్కొన్నారు.


తాము 26 పార్టీలకు చెందిన వారమన్న ఖర్గే, 11 రాష్ట్రాల్లో తమ పార్టీలు అధికారంలో ఉన్నాయన్నారు. భాజపా సొంతంగా 303 సీట్లు సాధించలేదన్నారు. ఓట్ల కోసం మిత్రపక్షాలతో కలిసి పనిచేసి, అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని భాజపా వదిలేస్తుందని ఆరోపించారు. ప్రస్తుతం భాజపా అధ్యక్షుడితోపాటు ఆయా రాష్ట్రాల కాషాయ నేతలు పాత మిత్రుల కోసం వివిధ రాష్ట్రాల్లో పరుగులు పెడుతున్నారని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.


వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాను ఓడించటమే ఏకైక లక్ష్యంగా వరుసగా రెండో రోజు విపక్షాలు సమావేశమయ్యాయి. బెంగళూరులోని తాజ్‌ వెస్ట్‌ఎండ్‌ హోటల్‌లో మంగళవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు భేటీ అయ్యారు. అయితే, దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. సొంత ప్రయోజనాల కోసం కొందరు ఏకమయ్యారని.. అది అవినీతిపరుల సదస్సు అని విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.

ఈ భేటీకి అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. దిల్లీ, పంజాబ్ , బిహార్ , ఝార్ఖండ్ , పశ్చిమ బంగాల్ , తమిళనాడు సీఎంలు పాల్గొన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ , సీపీఐ జనరల్ సెక్రటరీ డి రాజా, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ , ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. నిన్నటి సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా విపక్ష నేతలు తొలిరోజు సమాలోచనలు జరిపారు. ఇవాళ్టి సమావేశంలో ప్రతిపక్షాల కూటమికి పేరును నిర్ణయించనున్నారు. అనంతరం విపక్షాల ఫ్రంట్ అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఎన్నుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కన్వీనర్ గా నీతీశ్ కుమార్ పేరు వినిపిస్తోంది.

Tags

Next Story