RAHUL: సమయం లేదు మిత్రమా..

RAHUL: సమయం లేదు మిత్రమా..
మళ్లీ భారత్ జోడో యాత్రకు ప్లాన్

కాంగ్రెస్ పార్టీకి మంచి ఊపు తెచ్చిన భారత్ జోడో యాత్ర పార్టీ లో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఈ నేపథ్యంలోనే మరో టూర్ కు రాహుల్‌ గాంధీ రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటు.. 2024 ఏప్రిల్‌లో లోక్‌సభతో పాటుగా పలు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ యాత్రను చేపట్టేందుకు కాంగ్రెస్‌ సన్నాహాలు చేస్తోంది.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపా ఓటమే లక్ష్యంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మొదటి జోడో యాత్రకు వివిధ రాష్ట్రాల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓడించి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు ఈ యాత్ర దోహదం చేసిందనే ప్రచారం జరిగింది. పార్టీలో ఎంతో జోష్ నింపిన భారత్ జోడో యాత్ర రెండో విడతను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ మొదటి వారంలో గుజరాత్ లోని పోర్ బందర్ నుంచి చేపట్టాలని ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. దీన్ని త్రిపురలోని అగర్తలాలో ముగిస్తారని అంచనా. ఈ అంశంపై సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ నేతృత్వంలోని భారత్ జోడో యాత్ర సమన్వయ కమిటీ గతవారం సమావేశమైంది. ఈ సమావేశంలో యాత్ర ప్రారంభ తేదీతో పాటు స్థలం ఎంపికపై తీవ్రంగా చర్చించారు.



మొదటి విడత దక్షిణాన కన్యాకుమారి నుంచి ఉత్తరాన కశ్మీర్ వరకు పాదయాత్ర సాగగా రెండవ యాత్ర దేశ పశ్చిమం నుంచి తూర్పునకు యాత్ర చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. సెప్టెంబర్ 5న పోర్ బందర్‌లోని మహాత్మగాంధీ స్మారకం వద్ద నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించునున్నట్లు సమాచారం.పాదయాత్ర చేపడితే పూర్తి కావడానికి సుమారు 6 నెలల సమయం పడుతుందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

అయితే కొంతమంది నేతలు మాత్రం యాత్రను స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రారంభించాలని కోరుతున్నారు. ఆ రోజు ప్రారంభిస్తే.. దేశవ్యాప్తంగా భారీ ప్రచారం దక్కుతుందని చెబుతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇబ్బందులు తలెత్తే అవకాశముందని భావించిన అధిష్ఠానం, సెప్టెంబర్ కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరివైపుకాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మోకాలి సమస్యతో బాధపడ్తున్నారు. ప్రస్తుతం ఆయన కేరళలో మోకాలి నొప్పి సమస్యకు ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story