Congress President Elections : హాట్ హాట్‌గా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు..

Congress President Elections : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నిక సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అధ్యక్ష బరిలో నిలిచేదెవరనేదానిపై యావత్ దేశమంతా ఆసక్తితో గమనిస్తోంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న ఉదయ్‌పూర్ తీర్మానంతో...అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవమా లేక ఎన్నిక తప్పదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అటు కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు.
గతకొద్ది రోజులుగా ఊహాగానాలపై తెరదించుతూ.. కాంగ్రెస్‌ను బలమైన విపక్షంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. ఫలితం ఏదైనా పార్టీని ఏకం చేసేందుకు తాను కృషి చేస్తానని గహ్లోత్ పేర్కొ న్నారు. తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎం పదవి ఎవరికి కట్టబెట్టాలో అధిష్టానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
అటు కాంగ్రెస్ అధ్యక్ష పదవి పోటీకి ఎంపీ శశిథరూర్ సైతం సై అంటున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నేతలు పోటీకి ముందుకు వస్తున్న నేపథ్యంలో...ఇక ఎన్నిక తప్పదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
అటు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఇప్పటికే అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నికను అక్టోబర్ 17న అన్ని రాష్ట్రాల్లోని పీసీసీల్లో నిర్వహించనున్నారు. అక్టోబర్ 19న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. సెప్టెంబర్ 24 నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అక్టోబర్ 1న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబర్ 8లోగా నామినేషన్లను ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించారు. ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలైతే అక్టోబర్ 17న ఎన్నికలు నిర్వహిస్తారని పార్టీ జనరల్ సెక్రటరీ మధుసూదన్ మిస్త్రీ ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com