Congress: యువతకు తోడుగా కాంగ్రెస్.. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు..

Congress: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్‌పై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు రగులుతున్నాయి. ఆర్మీ అభ్యర్థుల ఆశలపై నీళ్లు చల్లేలా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను తక్షణమే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. యువత ఆలోచనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మోదీ సర్కార్ తీరును నిరసిస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేశారు. ఈ దీక్షలో కాంగ్రెస్ ఎంపీలు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలు, సీనియర్ నేతలు హాజరయ్యారు.
అగ్నిపథ్ స్కీంను ఉపసంహరించుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అటు నకిలీ జాతీయవాదులెవరో గుర్తించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ యువతకు సూచించారు. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్న వారికి తమ పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విరుచుకుపడ్డారు. యువత పట్ల కేంద్రం మొండిగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. యువత బాధను కేంద్రం అర్థం చేసుకుని అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అగ్నిపథ్‌పై యువతకు అనేక సందేహాలు ఉన్నాయని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. అగ్నిపథ్ ఆర్ఎస్ఎస్ అజెండాలో భాగమా..? లేక కొత్త సైనిక నియామకాల విధానమా అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
చదువుకున్న యువతకు అగ్నిపథ్ విధానం.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వంటిదన్నారు. మరోవైపు యువత శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అటు అగ్నిపథ్‌పై బీఎస్పీ అధినేత్రి మాయవతి కూడా విరుచుకుపడ్డారు. ఈ పథకం దేశ యువతను నిరాశకు గురిచేసిందని విమర్శించారు.. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని మాయావతి కోరారు. నిరసనలు చేస్తున్న యువత సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com