Digvijay Singh : మణిపూర్‌ అట్టుడుకుతుంటే.. ప్రధాని యోగనిద్ర

Digvijay Singh : మణిపూర్‌ అట్టుడుకుతుంటే.. ప్రధాని యోగనిద్ర
ప్రధానిపై మండిపడ్డ దిగ్విజయ్ సింగ్

మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే దేశ ప్రధాని అమెరికాలో తీరిగ్గా యోగా చేయడం ఏంటని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ ఆరోపించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యూఎస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రధానిని ఉద్దేశిస్తూ ఘాటైన విమర్శలు చేశారు. మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ నాయకత్వం వహించారని, పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయెబా ఉగ్రవాది, 2008 ముంబై దాడుల నిందితుడు సాజిద్ మీర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చే ప్రతిపాదనను చైనా అడ్డుకోవడంపై దిగ్విజయ్‌ సింగ్ ధ్వజమెత్తారు.





ఇప్పుడు ఈ ట్వీట్‌ నెట్టింట వైరల్‌‌గా మారింది. ఈ ట్వీట్‌కి నెటిజన్లు భిన్న రీతిలో స్పందిస్తున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ నాయకత్వంలో నిర్వహించడం కొందరు జీర్ణించుకోలేక పోతున్నారని విమర్శించారు. మరికొందరు, సింగ్‌ చెప్పిందే రైట్‌ అంటూ కమెంట్లు చేశారు.



గుజరాత్‌లో అల్లర్లు జరిగినప్పుడు పోలీస్‌ ఫోర్స్‌ సాయం కోరితే దిగ్విజయ్‌ సింగ్‌ నిరాకరించారని, ఆ సమయంలో సీఎంగా ఉన్న మోదీ ఈ విషయం బహిరంగంగా చెప్పారని ఒకరు ట్వీట్‌ చేశారు.

26/11 ఉగ్రదాడుల సమయంలో యూపీఏ సర్కార్‌ ఉందని, అప్పుడు వారిని గ్లోబల్‌‌ టెర్రరిస్టులుగా ఎందుకు ప్రకటించలేదని, బుజ్జగింపు రాజకీయాల కోసమేనా? అని ఫైర్‌ అయ్యారు.

మణిపూర్‌లో మారణకాండ

గత 50 రోజులుగా మణిపూర్‌లో అల్లర్లు చెలరేగుతున్నాయి. మెయితీ, కుకీ అనే రెండు తెగల మధ్య తీవ్రమైన హింస నెలకొంది. ఈ హింసాకాండలో దాదాపు 100 మంది మరణించారు. 1770 పైగా ఇండ్లు, ప్రార్థనా స్థలాలు ధ్వంసమయ్యాయి.




కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈ నెల 24న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశారని కాంగ్రెస్‌ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.




అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మణిపూర్‌ అల్లర్లు, ఉగ్రవాది సాజిద్ మీర్ బ్లాక్‌లిస్ట్‌ ప్రతిపాదనను చైనా అడ్డుకోవడం వంటి అంశాలు ఇప్పడు దేశంలో రాజకీయ దుమారానికి దారి తీశాయి.

Tags

Read MoreRead Less
Next Story