Congress: సీట్ల సర్దుబాటుకు ముందే కాంగ్రెస్‌ సర్వే

Congress: సీట్ల సర్దుబాటుకు ముందే కాంగ్రెస్‌ సర్వే
టార్గెట్​ 2024- 500 స్థానాల్లో కాంగ్రెస్ సర్వే

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార భాజపాను గద్దె దించాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. ఇండియా కూటమిలో సీట్ల పంపకానికి ముందే దేశవ్యాప్తంగా 500 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టాలని భావిస్తోంది. దీనికోసం A.I.C.సి ఓ పరిశీలకుల కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోంది. ఇండియా కూటమిలోని పార్టీలతో సీట్ల పంపకానికి ముందే దేశవ్యాప్తంగా 500 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే చేపట్టాలని భావిస్తోంది. ఇందుకు ఓ కారణం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇండియా కూటమి పార్టీలతో సీట్ల పంపకాల్లో ఆశించిన సీటు రాకపోయినా నిరుత్సాహపడకుండా అక్కడ కూడా విజయం సాధించేందుకు యత్నించాలని భావిస్తున్నట్టు చెప్పాయి. సీటు దక్కని చోట మిత్రపక్షాలకు సాయం చేసే స్థితిలో కూడా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. 500 లోక్‌సభ నియోజకవర్గాల్లో సర్వే కోసం ఐసీసీ ఓ పరిశీలకుల కమిటీని ఏర్పాటు చేయనుంది. వీరంతా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని సర్వే చేసి, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, హరియాణా, దిల్లీ, గుజరాత్, కర్ణాటక, బిహార్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాల్లో భాజపాకు 37 శాతం ఓట్లు వచ్చాయి. ప్రతిపక్షాలు 63 శాతం ఓట్లు సాధించినప్పటికీ ఐక్యంగా లేని కారణంగా ఓట్లు చీలి భాజపా గెలిపొందిందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ సారి ఆ తప్పు పునరావృతం కాకుండా విపక్షాల ఓట్లు ఏకమైతే 2024 ఎన్నికల ఫలితాలపై గణనీయమైన ప్రభావం చూపవచ్చని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

మహారాష్ట్రలోని మొత్తం 48 స్థానాల్లో తమ పార్టీ 23 సీట్లలో పోటీచేయాలనుకుంటున్నట్టు మిత్రపక్షాలైన శివసేన-UBT, NCPకి అనధికారికంగా కాంగ్రెస్ చెప్పిందని తెలుస్తోంది. బంగాల్‌ , బిహార్‌లలో 12 చొప్పున స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ గుర్తించినట్లు సమాచారం. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లోని 80 స్థానాల్లో 15 స్థానాలను హస్తం పార్టీ అడిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను, మధ్యప్రదేశ్‌కు రాజకీయ వ్యవహారాల కమిటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. వీటిలో పలు రాష్ట్రాల ఎన్నికల కమిటీల నిర్మాణం మధ్యప్రదేశ్‌కు ఎన్నికల, రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్మాణ ప్రతిపాదనను కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆమోదించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనా.....ప్రస్తుతం ఇండియా కూటమి సీట్ల పంపకం చర్చలు సరైన దిశలో సాగుతున్నాయని AICC మహారాష్ట్ర ఇంఛార్జ్ కార్యదర్శి ఆశిశ్ దువా తెలిపారు. ఈ నెలలోనే సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వస్తుందని చెప్పారు.

Tags

Next Story