CWC meeting: నేటి నుంచి సీడబ్ల్యూసీ సమావేశాలు

కర్ణాటకలోని బెలగావిలో నేడు, రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ భైఠక్‌గా నామకరణం చేశారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వనితులు, ప్రత్యేక ఆహ్వనితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీస్ బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారు. అయితే, మొత్తంగా 200ల మంది కీలక నేతలు ఈ మీటింగ్ లో పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది. ఈరోజు (డిసెంబర్ 26) మహాత్మాగాంధీ నగర్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. ఇక, రేపు (డిసెంబర్ 27) ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ రెండు తీర్మానాలను ఆమోదించుకోనుంది. దీంతో పాటే వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కీలక చర్చ జరపనున్నారు.
అయితే, ఈ భేటీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా గురించి కూడా చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్ధిక అసమానతలు ఏర్పడటం, ప్రజాస్వామ్యం ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కోవడం లాంటి అంశాలపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు. 1924లో బెలగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మాగాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, సామాజిక–ఆర్ధిక సమతుల్యత, సామాజిక న్యాయం లాంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశానికి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక భేటీని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com