Fake court: గుజరాత్‌లో అయిదేళ్లుగా నకిలీ కోర్టు!

ఉత్తుత్తి బ్యాంకులు.. పోలీసులు.. ఇపుడు ఏకంగా కోర్టులు కూడా ఈ జాబితాలో చేరాయి. గుజరాత్ రాజధాని నగరంలో గత అయిదేళ్లుగా ‘‘తీర్పులు’’ ఇస్తున్న నకిలీ కోర్టు గుట్టు రట్టయ్యింది. నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటుచేసి, న్యాయమూర్తిగా తీర్పులు ఇచ్చిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శామ్యూల్ అనుచరులే కోర్టు సిబ్బందిగా, న్యాయవాదులుగా నటించేవారు. గాంధీనగర్‌లోని తన కార్యాలయంలో నిజమైన కోర్టు వాతావరణాన్ని శామ్యూల్ సృష్టించాడని పోలీసులు తెలిపారు. అహ్మదాబాద్ సిటీ సివిల్‌కోర్టు రిజిస్ట్రారు నగరంలోని కరంజ్ పోలీస్‌స్టేషనులో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడు శామ్యూల్ ప్రభుత్వ భూమికి సంబంధించి 2019లోనే తన క్లయింట్‌కు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చాడు. తర్వాత ఆ భూమి రెవెన్యూ రికార్డుల్లో తన క్లయింట్ పేరును చేర్చాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు. ఈ ఉత్తర్వును అమలుచేయాలని కోరుతూ శామ్యూల్ మరొక న్యాయవాది ద్వారా సిటీ సివిల్‌కోర్టులో అప్పీల్ చేశాడు. తాను జారీ చేసిన నకిలీ ఉత్తర్వులను కూడా ఈ పిటిషనుకు జత చేశాడు. ఆ ఉత్తర్వులు నకిలీవని కోర్టు రిజిస్ట్రారు గుర్తించడంతో శామ్యూల్ బండారం బయటపడింది.
గత అయిదేళ్లుగా శామ్యూల్ నకిలీ కోర్టు నడుస్తోంది. సిటీ సివిల్‌కోర్టులో భూవివాదాల కేసులు పెండింగులో ఉన్న కక్షిదారులను గుర్తించి నిందితుడు వల పన్నేవాడు. ప్రభుత్వం నియమించిన అధికారిక మధ్యవర్తిగా పరిచయం చేసుకునేవాడు. తర్వాత పిటిషనర్లను తన ‘కోర్టు’కు పిలిపించుకునేవాడు. అక్కడ ట్రైబ్యునల్ ప్రిసైడింగ్ అధికారిగా నటిస్తూ తన క్లయింట్లకు అనుకూలమైన తీర్పులు ఇచ్చి, ఉత్తర్వులను జారీ చేస్తాడు. వారి నుంచి సొమ్ము తీసుకునేవాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com