G20 Summit: జీ20 సదస్సులో ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం
జీ20 శిఖరాగ్ర సదస్సులో భారత్ అతిపెద్ద విజయాన్ని సాధించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయంతో ఉన్న సభ్య దేశాల మధ్య న్యూదిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయాన్ని సాధించింది. ఈ శకం యుద్ధానిది కాదనే వ్యాఖ్యలతో కూడిన న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ20 సభ్య దేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అణ్వాయుధాల వినియోగం, ముప్పు ఆమోద యోగ్యం కాదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని జీ20 సభ్య దేశాలు ఖండించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఉద్దేశించి గతంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడినట్లుగానే ఈ శకం యుద్ధానిది కాదనే వ్యాఖ్యలతో కూడిన న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ20 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారానికి సంబంధించి అన్ని దేశాలు అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, వివాదాలను దౌత్యం, చర్చలు వంటి మార్గాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని న్యూదిల్లీ డిక్లరేషన్ పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఐరాస భద్రతా మండలి, ఐరాస సాధారణ సభలో ఆమోదించిన తీర్మానాలను డిక్లరేషన్ పునరుద్ధాటించింది. అన్ని దేశాలు పూర్తిగా UN చార్టర్ ఉద్దేశాలు, సూత్రాలకు అనుగుణంగా వ్యవహరించాలని పేర్కొంది. న్యూదిల్లీ డిక్లరేషన్‌ను జీ20లో అన్ని సభ్య దేశాలు ఆమోదించినట్లు ప్రధాని నరేంద్రమోదీ కరతాళధ్వనుల మధ్య ప్రకటించారు...Byte..
అణ్వయుధాల వినియోగం, ముప్పు ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారానికి ప్రధాన వేదికైన జీ20... భౌగోళిక రాజకీయ, భద్రతా సమస్యల పరిష్కారానికి వేదికకాదని చెబుతూనే... యుద్ధ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ముప్పును కలిగిస్తాయని జీ20 నేతలు అంగీకరించారు. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మానవాళి ఎదుర్కొంటున్న బాధలు, ప్రపంచ ఆహార భద్రత, ద్రవ్యోల్బణం పెరగడం, వృద్ధిరేటు మందగించడం వంటి అంశాలను డిక్లరేషన్‌లో హైలట్ చేశారు. ముఖ్యంగా కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకుంటున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు, పేద దేశాలపై యుద్ధ ప్రభావం ఎక్కువగా ఉందని జీ20 దేశాలు అభిప్రాయపడ్డాయి. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవడం, మనీలాండరింగ్ అంశాలు జీ20 సదస్సులో చర్చకు వచ్చినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు. ఉగ్రవాదం అన్ని రూపాలనూ జీ20 సభ్య దేశాలు ఖండించినట్లు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన వేళ...న్యూదిల్లీ డిక్లరేషన్‌కు సభ్య దేశాలు ఆమోద ముద్ర వేయడం కష్టమని అంతా భావించారు. డిక్లరేషన్ లేకుండానే చరిత్రలో తొలిసారి జీ20 సదస్సు ముగుస్తుందని అనుమానించారు. అయితే న్యూదిల్లీ డిక్లరేషన్‌పై సభ్య దేశాలను ఒప్పించడంలో భారత్ సఫలమైంది. దీన్ని భారత్ సాధించిన అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com