Carona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు

Carona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
17 రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదు, 4 వేలు దాటిన కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య

దేశంలో మళ్లీ కరోనా వైరస్‌ హడలెత్తిస్తోంది. గతంలో ప్రపంచ దేశాలను సైతం అతలాకుతం చేసినా కరోనా.. ఇప్పుడు కొత్తవేరియంట్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా మళ్లీ చాపకిందనీరులా విస్తరిస్తోంది. దేశంలో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగనే మోగాయి. ఈ కొత్త వేరియంట్‌ విజృంభిస్తుండటంతో కేసులు నెల రోజుల్లో 52 శాతం పెరిగాయి. అంటే కరోనా కేసులు విజృంభణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల 5 వేలకుపైగా మందికి కరోనా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక కరోనాతో లక్ష 18వేల మంది ఆస్పత్రిపాలైయ్యారు.

అటు నెల రోజుల వ్యవధిలో 3 వేల మందికిపైగా జనాలు కరోనా మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌-1తో వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో మళ్లీ ముక్కుకు నోటీకి మస్ట్‌గా మాస్క్ పెట్టాల్సిందే. దేశవ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరగడం, మరణాలు నమోదవ్వడం.. మూడేళ్ల కిందటి పీడకలను మళ్లీ గుర్తు చేస్తోంది. జెఎన్1 పేరుతో పుట్టుకొచ్చిన సబ్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ప్రజలు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని..తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.


సోమవారం నాటికి దేశ వ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4 వేలు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4,054 యాక్టివ్ కేసులున్నాయి. ఆదివారం నాటికి 3,742 గా ఉన్న యాక్టివ్ కేసులు, సోమవారం నాటికి 4 వేలు దాటాయి. కరోనా కారణంగా గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. కొత్తగా 628 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 మొదటిసారిగా గుర్తించిన కేరళలో ఒక రోజులో అత్యధిక సంఖ్యలో 128 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కారణంగా ఇప్పటివరకు 5,33,334 మంది చనిపోయారు. గత 24 గంటల్లో కరోనా నుంచి 315 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 4,44,71,860 చేరుకుంది. జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉండగా.. మరణాల రేటు 1.18 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story