ఆప్ సింధూర్ పై విద్యార్ధి పోస్ట్.. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడానికి నిరాకరించిన కోర్ట్

ఆప్ సింధూర్ పై విద్యార్ధి పోస్ట్.. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడానికి నిరాకరించిన కోర్ట్
X
అభ్యంతరకరమైన ఆప్ సిందూర్ పోస్ట్ కోసం పూణే విద్యార్థిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయడానికి బాంబే హైకోర్టు నిరాకరించింది.

ఆపరేషన్ సిందూర్ పై పూణేకు చెందిన ఓ విద్యార్ధిని అభ్యంతరకరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. అయితే దానిని కొట్టివేయడానికి బాంబే హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. విద్యార్థి తెలివైనదైనప్పటికీ తనపై నమోదైన కేసు కొట్టివేయడం సాధ్యం కాదని కోర్టు స్పష్టం చేసింది.

సింఘాడ్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్‌లో నాల్గవ సెమిస్టర్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆపరేషన్ సిందూర్ గురించి సమాచారం వెలువడిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ పెట్టింది. దానిని షేర్ చేయడంతో మే 9న కొంధ్వా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఆమె రెండు గంటల్లోనే ఆ పోస్ట్‌ను తొలగించి, శాంతిభద్రతల పరిస్థితిని సృష్టించే ఉద్దేశ్యం తనకు లేదని పేర్కొంటూ క్షమాపణలు చెప్పింది.

తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆ విద్యార్థిని న్యాయవాది ఫర్హానా షా ద్వారా పిటిషన్ దాఖలు చేసింది. ఆమె తరపున హాజరైన న్యాయవాది అమీన్ సోల్కర్, ఆమె క్షమాపణలు చెప్పిందని, ఆ పోస్ట్‌ను తొలగించిందని, ఇటీవల జరిగిన పరీక్షల్లో అద్భుతంగా ఉత్తీర్ణురాలైందని వాదించారు.

అయితే, ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్ మరియు న్యాయమూర్తి గౌతమ్ ఎ అంఖద్ లతో కూడిన ధర్మాసనం, “ఇది చాలా తీవ్రమైన విషయం... మీరు చదువుతున్న పిల్లలైతే, దీనిని బెయిల్ కోసం మాత్రమే పరిగణించవచ్చు... కానీ మేము దానిని రద్దు చేయలేము...” అని వ్యాఖ్యానించింది. “తెలివైన విద్యార్ధి అయినంత మాత్రానా ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని లేదు ” అని న్యాయమూర్తులు తెలిపారు.

తన క్లయింట్ వైపు నుండి ఎటువంటి తప్పిదం లేదని సోల్కర్ వాదించినప్పుడు, కోర్టు "వాదన అసంబద్ధం" అని స్పందించింది.

కోంధ్వా పోలీస్ స్టేషన్ నుండి పోలీసు నివేదికను కోరిన ధర్మాసనం, కేసు డైరీని సీల్డ్ కవర్‌లో కోర్టు పరిశీలన కోసం సమర్పించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మన్‌కున్వర్ దేశ్‌ముఖ్‌ను ఆదేశించింది. ఈ కేసు అక్టోబర్ 3న మళ్లీ విచారణకు రానుంది.

విద్యార్థిని అరెస్టు చట్టవిరుద్ధమని, అరెస్టుకు గల కారణాలను ఆమెకు తెలియజేయలేదని, సూర్యాస్తమయం తర్వాత ఆమెను ఆమె నివాసం నుండి తీసుకెళ్లారని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు. అరెస్టు తర్వాత కళాశాల నుండి తనను బహిష్కరించడంతో తన విద్యా కెరీర్ ప్రమాదంలో పడిందని విద్యార్థిని తెలిపింది. హైకోర్టులోని మరో బెంచ్ తరువాత ఆమెకు బెయిల్ మంజూరు చేసి, ఆమె బహిష్కరణను పక్కన పెట్టి, పరీక్షలకు హాజరు కావడానికి అనుమతించింది.

ఆ విద్యార్థిపై ఒక పోలీసు కానిస్టేబుల్ కేసు నమోదు చేశాడు.

Tags

Next Story