Narendra Modi: కెనడాలో హిందూ ఆలయంపై దాడిని తీవ్రంగా ఖండించిన ప్రధాని మోదీ

వేర్పాటు వాదాన్ని ఎగదోస్తూ భారత్ కు ప్రతిబంధకంగా మారిన ఖలిస్తాన్ మద్దతుదారులు, కెనడా దేశాన్ని తమకు సురక్షిత ఆవాసంగా పరిగణిస్తుంటారు. గత కొంతకాలంగా కెనడా ప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమకారులకు బాసటగా నిలుస్తున్న ధోరణి కనిపిస్తోంది. ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య జరిగినప్పటి నుంచి, కెనడా ప్రభుత్వం బాహాటంగానే భారత వ్యతిరేక వైఖరి కనబరుస్తోంది. ఇదే అదనుగా, కెనడాలో హిందూ ఆలయాలు, ప్రార్థనా మందిరాలపై తరచుగా దాడులు జరుగుతున్నాయి.
తాజాగా, బ్రాంప్టన్ నగరంలో ఓ హిందూ ప్రార్థనా మందిరంపై దాడి జరిగింది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కెనడాలో హిందూ దేవాలయంపై ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు.
ఇలాంటి దాడులతో భారత్ వైఖరిని బలహీనపర్చలేరని స్పష్టం చేశారు. కెనడాలోని భారత దౌత్యవేత్తలను భయభ్రాంతులకు గురిచేసేందుకు పిరికి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ఘోరాలపై కెనడా ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరించాలని కోరుతున్నామని మోదీ స్పష్టం చేశారు.
కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీలు అక్కడి బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు తెగబడటం తీవ్ర ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయుల భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఉగ్రవాదులు, వేర్పాటువాదుల హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ తరహా దాడుల నుంచి అన్ని ప్రార్థనాస్థలాలను సంరక్షించాలని మేం కెనడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. హింసకు కారకులైన వారిని శిక్షిస్తారని మేం ఆశిస్తున్నాం. కెనడాలో మా దేశీయుల భద్రత గురించి భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన చెందుతోంది. భారతీయులకు కాన్సులర్ సేవలు అందించే దౌత్యవేత్తలు ఈ తరహా బెదిరింపులకు తలొగ్గరు’’ అని జైస్వాల్ అన్నారు.
బ్రాంప్టన్‌లోని ఆలయ కాంప్లెక్స్‌లో కొందరు ఖలిస్థానీలు భక్తులపై దాడులు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. దీనిని ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం తీవ్రంగా పరిగణించారు. అక్కడి ప్రజలు అన్ని మతాలను పాటించే హక్కును కాపాడతామని ఆయన పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com