Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణ

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్ పేరును ఎన్డీఏ కూటమి ప్రకటించేసింది. అనూహ్యంగా ఊహాగానాల్లో వినిపించని పేరు తెరపైకి వచ్చి ఆశ్చర్యపరిచింది. అయితే రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీకి చాలా వ్యూహం ఉన్నట్లుగా తెలుస్తోంది.
రాధాకృష్ణన్ స్వస్థలం తమిళనాడులోని తిరుప్పూర్. తమిళనాడులో ఆయనకు బీజేపీ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక జార్ఖండ్, తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా పని చేసిన అనుభవం ఉంది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి తమిళనాడులో బలం పుంజుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షాణిది రాష్ట్రానికి చెందిన వ్యక్తికే ఉపరాష్ట్రపతి పదవి కట్టబెడితే.. ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చని భావించినట్లుగా సమాచారం. అంతేకాకుండా దక్షాణిది రాష్ట్రాల్లో సొంతంగా బలం పెరిగే అవకాశాలు ఉంటాయని ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాధాకృష్ణన్ అయితే బాగుంటుందని భావించి బీజేపీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీకి వీర విధేయుడిగా కూడా పని చేసిన చరిత్ర ఉంది. ఇలా అన్ని రకాలుగా రాధాకృష్ణన్‌కు కలిసొచ్చింది. అందుకే ఆయనను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక రాధాకృష్ణన్ ఆగస్టు 21న నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, కూటమి ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది.
ఇక సీపీ.రాధాకృష్ణన్ పూర్తి పేరు.. చంద్రపురం పొన్నుసామి రాధాకృష్ణన్. 2024 జూలై 31న మహారాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఫిబ్రవరి 18, 2023న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. రాధాకృష్ణన్ దాదాపు ఒకటిన్నర సంవత్సరాలు జార్ఖండ్ గవర్నర్‌గా కూడా పనిచేశారు. జార్ఖండ్ గవర్నర్‌గా ఉంటూనే తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా విధులు నిర్వర్తించారు.
తమిళనాడులోని తిరుప్పూర్‌లో అక్టోబర్ 20, 1957న రాధాకృష్ణన్ జన్మించారు. బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్‌గా ప్రస్థానం ప్రారంబమై.. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడయ్యారు. 1996లో తమిళనాడు బీజేపీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1998లో కోయంబత్తూరు నుంచి తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999లో తిరిగి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఎంపీగా ఉన్న కాలంలో టెక్స్‌టైల్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశారు. ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యు) పార్లమెంటరీ కమిటీ, ఆర్థిక సంప్రదింపుల కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇక స్టాక్ ఎక్స్ఛేంజ్ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న పార్లమెంటరీ ప్రత్యేక కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు.
2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. అధ్యక్షుడిగా ఉంటూ 93 రోజుల పాటు 19,000 కి.మీ. రథ యాత్ర చేపట్టారు. భారతదేశంలోని అన్ని నదుల అనుసంధానం, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, ఏకరీతి పౌర నియమావళిని అమలు చేయడం, అంటరానితనాన్ని తొలగించడం, మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడం వంటి డిమాండ్లతో యాత్ర సాగింది.
ఇక 2016లో కొచ్చిలోని కాయిర్ బోర్డు ఛైర్మన్‌గా కూడా నియమితులయ్యారు. నాలుగు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగారు. ఇక 2020 నుంచి 2022 వరకు కేరళలో బీజేపీకి అఖిల భారత ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. రాధాకృష్ణన్‌కు క్రీడలంటే ఆసక్తి. టేబుల్ టెన్నిస్‌లో కళాశాల ఛాంపియన్‌గా గెలిచారు. క్రికెట్, వాలీబాల్ అంటే కూడా ఇష్టం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com