Bihar Elections 2025: బీజేపీకి ఓటు వేశారనే అనుమానంతో.. దళిత కుటుంబంపై దాడి..

బీహార్ రాష్ట్రం గోపాల్‌గంజ్ జిల్లాలోని బైకుంత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల అనంతరం.. హింస చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిధవాలియా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని బుచెయా గ్రామంలో ఒక దళిత కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారు. బాధితుల ప్రకారం.. ఓటు వేసిన తర్వాత ఇంటికి తిరిగి వస్తుండగా కొంతమంది వారిని ఆపి బీజేపీకి ఓటు వేశారని ఆరోపిస్తూ కొట్టారు. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. చికిత్స కోసం సదర్ ఆసుపత్రిలో చేరారు. దాడి చేసిన వారిలో అఖిలేష్ యాదవ్, విశాల్ యాదవ్, ఇతరులు ఉన్నారని బాధితుల తరఫు వ్యక్తులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన అనంతరం మొత్తం కుటుంబం భయాందోళనకు గురైంది.
ఇంతలో SDPO రాజేష్ కుమార్ ఈ సంఘటనను ధృవీకరించారు. బైకుంత్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోలింగ్ ముగిసిన తర్వాత.. మూడు ప్రదేశాలలో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయని చెప్పారు. బైకుంత్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగ్రా, ముహమ్మద్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్కులి, సిద్వాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బుచేయా ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వెల్లడించారు. RJD మద్దతుదారులు దాడులు చేశారని ఆరోపిస్తూ మూడు ప్రదేశాలలోనూ వేర్వేరు వ్యక్తులు ఫిర్యాదులు దాఖలు చేశారని వెల్లడించారు. గాయపడిన వ్యక్తుల నుంచి లిఖితపూర్వక ఫిర్యాదులు తీసుకుంటున్నామని, దర్యాప్తు అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
మరోవైపు.. బీజేపీ అభ్యర్థి మిథిలేష్ తివారీ సదర్ ఆసుపత్రిని సందర్శించి, గాయపడిన వారిని పరామర్శించారు. సంఘటన గురించి ఆరా తీశారు. తను ఓడిపోతానని నిరాశ చెందిన ఆర్జేడీ ఎమ్మెల్యే ప్రేమ్ శంకర్ యాదవ్ మద్దతుదారులు బీజేపీ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. బంగ్రాలో సంజీత్ మిశ్రా, దేవ్‌కులిలో సుమన్ సింగ్, బుచేయాలో ఒక దళిత కుటుంబ సభ్యులను కొట్టారని తివారీ పేర్కొన్నారు. నిందితులను 48 గంటల్లోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

