Pakistan: పాక్‌కు సమాచారం లీక్‌.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ అరెస్ట్‌

Pakistan: పాక్‌కు సమాచారం లీక్‌.. సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ అరెస్ట్‌
X
పహల్గామ్ ఉగ్రదాడికి 6 రోజుల ముందే అక్కడి నుంచి బదిలీ

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్)కు చెందిన ఒక అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఏఎస్సై)ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. మోతీరామ్ జాట్ అనే ఈ జవాను పహల్గామ్‌లో ఉగ్రదాడికి ఆరు రోజుల ముందు వరకూ అక్కడే విధులు నిర్వర్తించాడు.

అధికారల కథనం ప్రకారం.. మోతీ రామ్ జాట్ 2023 నుంచి పాకిస్థాన్ గూఢచార సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని అందిస్తున్నాడు. అతడి సోషల్ మీడియా కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉండటంతో సీఆర్పీఎఫ్ అంతర్గత నిఘా విభాగం కొంతకాలంగా అతడిపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అతడి గూఢచర్య కార్యకలాపాలు బయటపడ్డాయి. దీంతో సీఆర్పీఎఫ్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని నాలుగు రోజుల పాటు విచారించి, సర్వీసు నుంచి తొలగించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం ఎన్ఐఏకు అప్పగించారు.

మోతీ రామ్ జాట్ సోషల్ మీడియా వేదికగా పాకిస్థానీ హ్యాండ్లర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపినట్టు ఎన్ఐఏ ప్రాథమిక విచారణలో తేలింది. ఈ గూఢచర్యం ద్వారా అతడు లక్షల రూపాయల మొత్తాన్ని అందుకున్నాడని, ఆ డబ్బును తన భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. మన సైనిక బలగాల రహస్య ఆపరేషన్లు, వ్యూహాత్మక ప్రాంతాల్లో భద్రతా దళాల మోహరింపు వంటి అత్యంత కీలకమైన సమాచారాన్ని అతడు పాకిస్థాన్‌కు చేరవేసినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు.

Tags

Next Story