Manipur Violence: రాత్రి వేళ ముఖ్యమంత్రి నివాసం ముట్టడి ప్రయత్నం

ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యకు నిరసనగా మణిపుర్ లో మళ్లీ మొదలైన ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. నిరసనకారులు ఏకంగా పశ్చిమ ఇంఫాల్ డిప్యుటీ కమిషనర్ కార్యాలయంపై దాడికి పాల్పడి అక్కడే ఉన్న వాహనాలకు నిప్పంటించారు. మరో చోట ఓ గుంపు పోలీస్ వాహనంపై దాడి చేసి ఆయుధాన్ని పట్టుకెళ్లినట్టు మణిపుర్ పోలీసులు తెలిపారు. ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ పూర్వీకుల గృహాలపైనా దుండగులు దాడికి ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. థౌబాల్ జిల్లా ఖాంగ్జామ్ లో భాజపా కార్యాలయానికి నిప్పంటించారు. మరో వైపు యువతీ.యువకుడి హత్య ఘటనపై సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించినప్పటికీ వారి మృతదేహాల జాడ తెలియరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ దర్యాప్తుపై తమకు నమ్మకం ఉందని, అస్థికలు వెతికి ఇచ్చినా తమ పిల్లలకు తుది వీడ్కోలు పలుకుతామని వాపోయారు.
మణిపుర్‌లో మే నెల నుంచి కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, కశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి రాకేష్ బల్వాల్‌ను మణిపూర్‌కు నియమించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయించింది. రాజస్థాన్‌కు వాసి అయిన రాకేశ్ బల్వాల్ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారి.. మణిపుర్ కేడర్‌లో ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన .. 2018లో ఎన్‌ఐఏలో ఎస్పీగా పదోన్నతి పొంది.. 2019లో పుల్వామా ఘటనను దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఆ దర్యాప్తులో కీలక పాత్ర వహించిన రాకేశ్ 2021 డిసెంబరులో పదోన్నతిపై AGMUT (అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్ర పాలిత ప్రాంతాలు) కేడర్‌కు బదిలీ అయి.. శ్రీనగర్ సీనియర్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా మణిపుర్‌లో శాంతి భద్రతలను పునరుద్ధరించేందుకు రాకేశ్‌ను తిరిగి సొంత కేడర్ పంపించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించినట్లు సమాచారం.
రాజధాని ఇంఫాల్ సరిహద్దులోని సీఎం ఎన్ బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయిందని సమాచారం. సీఎం పూర్వీకుల ఇల్లు ఖాళీగా ఉందని, అందులో ఎవ్వరూ నివసించటం లేదని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. ఇంటి చుట్టూ నిరంతరం పోలీసు పహారా ఉందని తెలిపారు. లోయలో భద్రతా బలగాల్ని పెద్ద ఎత్తున మోహరించినప్పటికీ ఈ దాడి జరగటం సర్వత్రా ఆందోళనకు గురిచేసింది. గుంపును పోలీసులు చెదరగొట్టారని తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com