Gold: ఎయిర్‌పోర్టులో 10 కిలోల బంగారం పట్టివేత..

విలువ రూ.7.8 కోట్ల పైనే

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం పట్టుబడింది. మిలాన్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.కోట్ల విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.

జమ్ము కశ్మీర్‌కు చెందిన 43, 45 ఏళ్ల వయసు గల ఇద్దరు వ్యక్తులు మిలాన్‌ నుంచి ఢిల్లీకి వచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో వారి లగేజీని స్కాన్‌ చేయగా అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. అయితే ఆ ఇద్దరు ప్రయాణికుల్ని వ్యక్తిగతంగా తనిఖీ చేయగా సుమారు 10 కిలోల బంగారం పట్టుబడింది. ప్రత్యేకంగా రూపొందించిన రెండు నడుము బెల్ట్‌లో బంగారు నాణేలను ప్లాస్టిక్‌ ఎన్వలప్‌లో చుట్టి అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. పట్టుబడిన పసిడి విలువ దాదాపు రూ.7.8 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు.. ఆ ఇద్దరు ప్రయాణికుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

నిందితులిద్దరూ కశ్మీర్‌కు చెందినవారిగా గుర్తించారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బంగారు నాణేల ఫొటోలను దిల్లీ కస్టమ్స్‌ అధికారులు ‘ఎక్స్‌’ ఖాతాలో విడుదల చేశారు.

Tags

Next Story