CWC MEET: బీజేపీ పాలనలో దేశం పదేళ్లు వెనక్కి: కాంగ్రెస్‌

CWC MEET: బీజేపీ పాలనలో దేశం పదేళ్లు వెనక్కి: కాంగ్రెస్‌
మోదీ పాలనపై మండిపడ్డ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ... నేడు విస్తృత స్థాయి సమావేశం

బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం దేశాన్ని దశాబ్ద కాలం పాటు వెనక్కి తీసుకెళ్లిందని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(CWC) ఆరోపించింది. హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న CWC భేటీ తొలిరోజున... నరేంద్రమోదీ ప్రభుత్వ తీరుపై మండిపడింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ, ఇతర నేతలు పాల్గొన్నారు. నాలుగు గంటలకుపైగా జరిగిన సమావేశంలో పలు తీర్మానాలను CWC ఆమోదించింది.


రాజకీయ, ఆర్థిక, జాతీయ భద్రతా అంశాల్లో NDA ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆరోపించింది. రాజ్యాంగం, సమాఖ్య వ్యవస్థ సవాళ్లు ఎదుర్కొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్‌ మిత్రులకు అప్పగిస్తూ క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడున్నారని ఆక్షేపించింది. ఒకే దేశం-ఒకే ఎన్నికల ప్రతిపాదనను తిరస్కరించిన CWC, మహిళా రిజర్వేషన్లు, కుల గణన చేపట్టాలని తీర్మానించింది.

రాజకీయ, ఆర్థిక పరిస్థితులతోపాటు దేశం లోపల, సరిహద్దు వెలుపల ఉన్న భద్రతా పరిస్థితులపై కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. బీజేపీ నేతృత్వంలోని NDA ప్రభుత్వం దేశాన్ని దశాబ్దాల కాలం వెనక్కి తీసుకెళ్లిందని, అన్ని రంగాల్లోనూ తీవ్ర వైఫల్యం చెందిందని CWC ఆక్షేపించింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అంతర్గత భద్రత, చైనా దురాక్రమణ, రాజ్యాంగంపై దాడి, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడం ద్వారా మోదీ సర్కారు దేశాన్ని తిరోగమన దిశలో పయనింపజేస్తోందని మండిపడింది. విచారణ సంస్థలను రాజకీయ కక్ష సాధింపుల కోసం దుర్వినియోగం చేస్తోందని, బీజేపీ ఓటమి పాలైన రాష్ట్రాలకు నిధులు ఇవ్వడం లేదని ఆరోపించింది.


కీలకమైన మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై ముందుకుసాగాలని CWC ఆకాంక్షించింది. దేశంలో విలువైన ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం కొందరు పెట్టుబడిదారీ మిత్రులకు అప్పగిస్తోందని ఆక్షేపించింది. కేంద్రం ఆర్భాటపు, ప్రచారం రాజకీయాలు మాని ప్రగతివైపు పయనించాలని సూచించింది. నినాదాలతో దేశం అభివృద్ధి చెందదని CWC చురుకలు అంటించింది. కులగణన తక్షణం చేపట్టాలని SC, ST, OBC రిజర్వేషన్ల గరిష్ఠ పరిమితిని పెంచాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానించింది. మణిపూర్, కశ్మీర్ సహా పలు అంశాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా తీవ్ర వైఫల్యం చెందారని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మండిపడింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై లేఖ రాసిన సోనియాను CWCఅభినందించింది. దేశాన్ని విభజించే శక్తులకు వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్‌ జోడోయాత్ర దోహదం చేసిందని పేర్కొంది.

ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సీడబ్ల్యూసీ సభ్యులతోపాటు అన్ని రాష్ట్రాల PCC, CLP నేతలూ సమావేశంలో పాల్గొంటారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story