Remal Cyclone: బెంగాల్‌లో రెమాల్‌ బీభత్సం, ప్రస్తుతానికి బలహీనం

బంగ్లాదేశ్‌లో కూడా

తీరందాటే సమయంలో పశ్చిమ్ బెంగాల్‌, బంగ్లాదేశ్‌లో రెమాల్‌ తుపాను బీభత్సం సృష్టించింది. గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. తుపాను ధాటికి బంగ్లాదేశ్‌లో ఏడుగురు, పశ్చిమ్‌ బెంగాల్‌లో ఇద్దరు మృతి చెందారు. పశ్చిమ్ బెంగాల్‌లోని తీర ప్రాంతాల్లో మౌలిక వసతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తీరం దాటాక రెమాల్ తుపాను బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

రెమాల్ తుపాను పశ్చిమ్‌ బెంగాల్‌లోని సాగర్‌ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపారా మధ్య తీరం దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వెల్లడించింది. తుపాను ధాటికి కోల్‌కతా నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పెను గాలుల ధాటికి వందలాది చెట్లు నేలకొరిగాయి. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. సథరన్‌ అవెన్యూ, లేక్‌ వ్యూ రోడ్‌, ప్రతాప్‌ ఆదిత్య రోడ్‌, సెంట్రల్‌ అవెన్యూ , అలీపోర్‌ ప్రాంతాలలో నీళ్లు నిలిచిపోయాయి. మానిక్‌టాలా ప్రాంతంలో ముగ్గురికి గాయాలయ్యాయి. సెంట్రల్‌ కోల్‌కతాలో గోడ కూలి ఒకరు మృతి చెందారని ఆ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారి తెలిపారు. సుందర్‌బన్స్ మడ అడవుల సమీపంలో ఉన్న మౌసుని ద్వీపంలో చెట్టు గుడిసెపై పడటంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఈదుర గాలులకు కోల్‌కతా శివారు ప్రాంతంతో పాటు వేర్వేరు ప్రదేశాలలో విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

గతంలో విధ్వంసం సృష్టించిన అంపన్‌ తుపానుతో పోలిస్తే రెమాల్‌ ప్రభావం తక్కువేనని కోల్‌కతా మేయర్‌ ఫర్హాద్‌ హకీమ్‌ వెల్లడించారు. కూలిన వృక్షాల తొలగింపు చర్యలు చేపట్టామని తెలిపారు. కోల్‌కతా విమానాశ్రయంలో 21 గంటల పాటు విమానాల రాకపోకలను నిషేధించగా...ఆ తర్వాత పునరుద్ధరించినట్లు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా అధికారి తెలిపారు. దక్షిణ, ఉత్తర పరగణా జిల్లాలు, మిడ్నాపుర్‌లో గాలులు ధాటికి ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. దక్షిణ బెంగాల్‌లో సహాయక చర్యలు చేపట్టేందుకు 14 జాతీయ విపత్తు ప్రతిస్పందన బృందాలను అధికారులు రంగంలోకి దించారు. తీర ప్రాంతాలలో ఉన్న ప్రజలకు ఆహారంతో పాటు టార్పలిన్‌ కవర్లు అందిస్తున్నారు. అటు రెమాల్ తుపానుపై పశ్చిమ్‌ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీఎస్‌ గోపాలికకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ప్రకారం నష్టం పరిహారం అందించాలని మమత సర్కార్‌ నిర్ణయించిందని ఓ అధికారి తెలిపారు.

రెమాల్ తీవ్ర తుపాను తీరం దాటాక తుపానుగా బలహీన పడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కోల్‌కతాలో ఆదివారం నుంచి సోమవారం ఉదయం ఐదున్నర గంటల వరకు146 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని పేర్కొంది. రెమాల్ తుపాను క్రమంగా ఈశాన్య రాష్ట్రాల వైపు పయనిస్తోందని ఐఎండీ తెలిపింది. అసోంలోని ఏడు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరో 11 జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. దక్షిణ అసోంతో పాటు మేఘాలయలో 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

అటు బంగ్లాదేశ్‌లో రెమాల్‌ తుపాను ధాటికి వేర్వేరు ప్రాంతాలలో ఏడుగురు మృతి చెందారు. నష్ట తీవ్రతను తగ్గించే ఉద్దేశంతో బంగ్లాదేశ్‌ రూరల్‌ పవర్‌ అథారిటీ విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తీర ప్రాంతాలలోని 15 లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు

Tags

Next Story