Cyclone Michaung: దూసుకొస్తున్న మిచాంగ్ తుపాను

Cyclone Michaung:  దూసుకొస్తున్న మిచాంగ్ తుపాను
దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రం మలక్కా జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు విస్తరిస్తోందని... నవంబర్ 30నాటికి ఇది మరింత బలపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వాయుగుండం రానున్న 48 గంటల్లో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశముందని అధికారులు తెలిపారు. తుఫానుగా బలపడితే దీనికి 'మిచాంగ్'అని నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 మధ్య దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.

అండమాన్ నికోబర్ దీవుల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. తుపాను ధాటికి గంటకు 35 - 45 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్య బంగాళాఖాతంలో డిసెంబర్ 1న గంటకు 50 కి.మీ - 60 కి.మీ వేగంతో, డిసెంబర్ 2న గంటకు 50-60 కి.మీ నుండి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు తీరప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది. ప్రభుత్వం ... బాలాసోర్, భద్రక్, కేంద్రపారా, జగత్‌సింగ్‌పూర్, పూరీ, ఖుర్దా, గంజాం జిల్లాల కలెక్టర్‌లకు రాసిన లేఖలోఅప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది.


డిసెంబరు మొదటి వారంలో తుపాను తీరం దాటొచ్చని, ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు... కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. పంటలు కోత దశలో ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వానలు కురుస్తాయని వివరించారు.నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, వైయస్‌ఆర్‌ జిల్లాల్లో మంగళవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా నెల్లూరు జిల్లా రాపూరులో 8.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది.

Tags

Read MoreRead Less
Next Story