CAA: సీఏఏ అమలుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్

పౌరసత్వ సవరణ చట్టం అమలును నిలిపివేసేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో మంగళవారం మరో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. మతవివక్ష చూపేలా ఉన్న ఆ నిబంధనలు రాజ్యాంగ వ్యతిరేకమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య విడివిడిగా ఈ పిటిషన్లు వేశాయి. ఇది రాజ్యాంగ విరుద్ధం, వివక్షాపూరితమంటూ IUML అభ్యంతరం వ్యక్తంచేసింది. CAA రాజ్యాంగ చట్టబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటికే దాఖలైన 250 పిటిషన్లపై తీర్పు వచ్చే వరకు ఆ చట్ట నిబంధనల అమలు పై స్టే విధించాలని IUML తన పిటిషన్లో కోరింది. 2019లోనూ సీఏఏను సవాల్ చేస్తూ IUML సుప్రీంకు వెళ్లింది. నిబంధనలను నోటిఫై చేయకపోవడంతో చట్టం అమల్లోకి రాదని కేంద్రం.. అప్పట్లో న్యాయస్థానానికి వెల్లడించింది. తాజాగా నిబంధనలు జారీ చేయడంతో మళ్లీ ఆ అంశం కోర్టుకు చేరింది.
కాగా, సీఏఏ చట్టం - 2019లోనే పార్లమెంట్ ఆమోదం పొంది.. రాష్ట్రపతి సమ్మతి లభించినా.. విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనలతో దీని అమలులో జాప్యం జరిగింది. 1955 నాటి చట్టంలో సవరణలు చేసిన మోదీ సర్కార్ 2019 డిసెంబర్‌లో పార్లమెంట్‌లో ఈ బిల్‌ని ప్రవేశపెట్టింది. 2020లో అమలు చేయాలని చూసినప్పటికీ పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా తాత్కాలికంగా ఆ చట్టాన్ని పక్కన పెట్టింది. దాదాపు ఐదేళ్ల తరవాత ఈ చట్టం అమల్లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర హోంశాఖ గెజిట్ విడుదల చేసింది. మరి కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం కీలకంగా మారింది. దీనిపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొందరిపై వివక్ష చూపేలా ఉంటే ఈ చట్టాన్ని అమలు చేయబోనని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పటికే ప్రకటించారు. అటు, ఈ చట్టాన్ని తాము అమలు చేసేది లేదంటూ కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు. తాజాగా, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సైతం సీఏఏ అమలును వ్యతిరేకించారు.
పౌరసత్వ సవరణ చట్టం ప్రధాన లక్ష్యం శరణార్థులకు భారత పౌరసత్వం కల్పించడం. అయితే.. ఈ విషయంలో కొన్ని నిబంధనలు విధించింది కేంద్ర ప్రభుత్వం. 2014 డిసెంబర్ 31వ తేదీ కన్నా ముందు హింసకు గురై భారత్‌కి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు. అర్హులెవరో కూడా ఈ గెజిట్‌లో స్పష్టంగా చెప్పింది కేంద్రం. భారత్‌లో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఓ నిబంధన ఉంది. దాన్ని పూర్తిగా సవరించింది మోదీ సర్కార్. గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదంటే ఏడాది కాలంగా భారత్‌లోనే నివసించిన వారికి మాత్రమే ఈ చట్టం వర్తిస్తుందని స్పష్టం చేసింది. అయితే..ఇందులో గిరిజన ప్రాంతాలను మాత్రం మినహాయించింది. అసోం, మేఘాలయా, మిజోరం, త్రిపురను మినహాయిస్తున్నట్టు వెల్లడించింది. భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో ఉండడం వల్ల అసోంలోని కర్బీ అంగ్‌లాంగ్, మేఘాలయలోని గారో హిల్స్, మిజోరంలోని చమ్‌కా, త్రిపురలోని పలు గిరిజన ప్రాంతాలను చట్టం నుంచి మినహాయించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com