గ్రీన్ కార్డు నిబంధనలు సడలించిన అమెరికా

గ్రీన్ కార్డు నిబంధనలు సడలించిన అమెరికా
వేలాది మంది భారతీయులకు ఆశలకు ఊపిరి

ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో అమెరికా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. విదేశీ పౌరులకు శాశ్వత నివాసం కోసం జారీ చేసే గ్రీన్‌ కార్డు అర్హత నిబంధనలను సరళతరం చేసింది. ఈ మేరకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ కోసం అర్హత ప్రమాణాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీంతో అమెరికాలో స్థిరపడాలని ఆశిస్తోన్న వేలాది మంది భారతీయులకు లబ్ధి చేకూరనుంది.

అమెరికా అనేది ఎంతోమంది కల. అక్కడ స్థిరపడాలని లేదా ఆ దేశం గ్రీన్‌కార్డు పొందాలనేది చాలా మంది కోరుకుంటారు. కానీ ఇదంత ఆషామాషీ విషయం కాదు. అయితే ఇక నుంచి ఇది కాస్త సులభం కానుంది. జో బిడెన్ ప్రభుత్వం తాజా నిర్ణయాలు లక్షలాది భారతీయల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడాలని చాలామంది కోరుకుంటుంటారు. అలాంటి వ్యక్తులకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు జారీ చేస్తుంది. అమెరికా ప్రభుత్వ ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం ఏడాది లక్షా 40 వేల గ్రీన్‌కార్డులు జారీ అవుతుంటాయి.

ఒక్కో దేశానికి పరిమితమైన సంఖ్య ఉంటుంది. అంటే గ్రీన్‌కార్డు కోసం చేరే మొత్తం దరఖాస్తుల్లో ఒక్కొక్క దేశానికి 7 శాతానికి మించి కేటాయించకూడదు. ఇప్పుడు నిబంధనలు మార్చడంతో కొత్తగా గ్రీన్‌కార్డు కోసం దాఖలు చేసుకున్నవారికి కూడా గ్రీన్‌కార్డు లభించవచ్చు. కొత్త నిబంధనల ప్రకారం ఈఏడీ నిబంధన తొలగించారు. గతంలో అయితే ఈఏడీ అర్హత ఉంటేనే గ్రీన్‌కార్డు జారీ అయ్యేది. మరోవైపు వీసా నిబంధనల్లో కూడా మార్పు చేసింది వీలైనన్ని ఎక్కువ వీసాలు ఇచ్చేందుకు ఇండియాలోని అమెరికన్ రాయబార కార్యాలయాలు ప్రయత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించింది.

గ్రీన్ కార్డు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే కాకుండా రెన్యువల్ చేసుకునే వారికి కూడా తాజా మార్గదర్శకాలు వర్తింపచేయనున్నట్లు తెలిపింది. అమెరికాలో చట్టబద్ధంగా పనిచేసే వారి సంఖ్యను పెంచేందుకు తాజా నిర్ణయం దోహదం చేస్తుంది. మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో ఈ మార్పు రావటంతో భారతీయుల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూన్ 21 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించడమే కాకుండా అక్కడి చట్టసభల్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, ద్వైపాక్షిక రంగాలకు ఈ పర్యటన దోహదపడనుంది. అమెరికా కాంగ్రెస్‌ సంయుక్త సమావేశంలోనూ ప్రధాని ప్రసంగిస్తారు. అలాగే, మోదీ గౌరవ సూచికంగా వైట్‌హౌస్‌లో బైడెన్‌ దంపతులు అధికారక విందును కూడా ఏర్పాటు చేయనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story