Dead animals in packaged food : చిప్స్ ప్యాకెట్‌లో ‘చచ్చిన కప్ప’.. సిరప్ బాటిల్‌లో ‘చచ్చిన ఎలుక’.

ఏం తింటున్నామో తెలియని వైనం

చిన్నారి ఇష్టంగా తింటున్న చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప కనిపించింది. ఇది చూసి ఒక కుటుంబం షాక్‌ అయ్యింది. ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో చిప్స్‌ తయారీ సంస్థపై దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం పుష్కర్ ధామ్ సొసైటీకి చెందిన జాస్మిన్‌ పటేల్‌ నాలుగేళ్ల మేనకోడలు స్థానిక షాపు నుంచి చిప్స్‌ ప్యాకెట్‌ కొనుగోలు చేసింది. ఆ మహిళ తొమ్మిది నెలల కూతురు, ఆ చిన్నారి కలిసి చిప్స్‌ తిన్నారు.

కాగా, చిప్స్‌ ప్యాకెట్‌లో చనిపోయిన కప్పను ఆ పాప గమనించింది. ఆ వెంటనే ఆ ప్యాకెట్‌ను దూరంగా విసిరేసింది. ఆ చిప్స్‌ ప్యాకెట్‌ను బాలాజీ వేఫర్స్ అనే సంస్థ తయారు చేసినట్లు జాస్మిన్‌ పటేల్‌ గమనించింది. ఆ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌, కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసింది. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో బుధవారం ఉదయం ఫుడ్‌ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేసింది.


మరోవైపు జామ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ సంఘటనపై స్పందించారు. చిప్స్‌ ప్యాకెట్‌ అమ్మిన షాపును తనిఖీ చేశారు. బాలాజీ వేఫర్స్ తయారు చేసిన చిప్స్‌ ప్యాకెట్ల బ్యాచ్‌ నుంచి శాంపిల్స్ సేకరిస్తామని తెలిపారు. దర్యాప్తు తర్వాత తగిన చర్యలు చేపడతామని అధికారులు వెల్లడించారు.

‘కప్ప’ ఘటనపై చిప్స్ తయారీదారు స్పందన

ఈ ఘటనపై చిప్స్ తయారీదారు ‘బాలాజీ వేఫర్స్’ మేనేజర్ జై సచ్‌దేవ్ స్పందిస్తూ.. తమ వద్ద అలాంటి పొరపాటు జరిగేందుకు ఆస్కారమే లేదంటూ ఖండించారు. ‘మా ప్లాంట్‌లో అత్యాధునిక యంత్రాలు ఉన్నాయి. ఆటోమేటిక్ విధానంలో పనిచేసే ఈ యంత్రాలు ఏదైనా పాడైపోయిన బంగాళాదుంప వచ్చినా తొలగిస్తాయి. అందువల్ల చిప్స్ ప్యాకెట్‌లో చనిపోయిన కప్ప వచ్చిందనే వార్తను మేం ఎంతమాత్రం అంగీకరించలేం. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతున్నాం. ప్రజలకు పరిశుభ్రమైన ఉత్పత్తులను అందించడమే మా లక్ష్యం’ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు.

సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుక

మరో భయానక ఘటనలో.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్‌లో చనిపోయిన ఎలుకను ఒక మహిళ గుర్తించింది. ప్రమీ శ్రీధర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకంపనలు రేపుతోంది. తమ కుటుంబంలోని ముగ్గురు చిన్నారులు కలుషితమైన సిరప్‌ను సేవించారని, వారిని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని ప్రమీ శ్రీధర్ తెలిపారు.సిరప్‌ను పోస్తున్నప్పుడు అందులో చిన్న చిన్న వెంట్రుకలు కనిపించాయని, పరిశీలించి చూడగా సిరప్ బాటిల్‌లో చనిపోయిన ఎలుక కనిపించిందని రాసుకొచ్చారు. ముంబైకి చెందిన మరో వ్యక్తి తాను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఐస్‌క్రీమ్ కోన్‌లో ‘మనిషి వేలు ముక్క’ను గుర్తించిన సంగతి తెలిసిందే.

Tags

Next Story