Jellyfish: బీచ్‌లో చనిపోయిన జెల్లీ ఫిష్‌లు.. పర్యాటకులు ఆందోళన

బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్‌లు కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో బీచ్‌లో జెల్లీ ఫిష్‌లు తేలుతుండటంపై పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఒడిషాలోని ప్రముఖ పూరీ బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్‌లు పెద్ద సంఖ్యలో కొట్టుకువస్తున్నాయి. సముద్రం నీటిపై అవి తేలుతున్నాయి.
కాగా, సముద్రంలో స్నానం చేసే పర్యాటకులు జెల్లీ ఫిష్‌ల కారణంగా దురదల బారిన పడుతున్నారు. గత నెల రోజులుగా పూరీ బీచ్‌లో స్నానం చేసిన వారిలో కొందరు వ్యక్తులు చికిత్స కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చేరారు. హాస్పిటల్‌లోని డాక్టర్లు కూడా దీనిని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో పూరీ బీచ్‌ను శుభ్రం చేయాలని, పరిశుభ్రతను కాపాడేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని పర్యాటకులు, సముద్ర ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు లోతైన సముద్ర ప్రాంతాల్లో నివసించే జెల్లీ ఫిష్‌లు పెద్ద సంఖ్యలో మరణించి తీరానికి కొట్టుకురావడంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా వేసవి సమయంలో ఇలా జరుగుతున్నట్లు పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com