Kerala: ప్రియుడిని చంపిన యువతికి ఉరి

Kerala: ప్రియుడిని చంపిన యువతికి ఉరి
X
కేరళ కోర్టు సంచలన తీర్పు

కేరళలో 2022లో సంచలనం సృష్టించిన ప్రియుడి హత్య కేసులో యువతికి ఉరిశిక్ష విధిస్తూ సోమవారం న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మూడో నిందితుడైన ఆమె బంధువు నిర్మలకుమారన్‌కు మూడేండ్ల కారాగార శిక్ష విధిస్తూ నెయ్యట్టిన్‌కార అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు తీర్పు వెలువరించింది. తన విద్యార్హతలు, క్రిమినల్‌ చరిత్ర లేకపోవడం, తన తల్లిదండ్రులకు తాను ఏకైక కుమార్తె కావడం వంటి కారణాలను దృష్టిలో పెట్టుకుని శిక్ష విషయంలో ఉదారంగా వ్యవహరించాలని నిందితురాలు గ్రీష్మ (24) చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. నిందితురాలి నేర తీవ్రతను పరిగణనలోకి తీసుకుంటే ఆమె వయసు, ఇతర కారణాలను పరిశీలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

తిరువనంతపురం జిల్లాలోని పరస్సలకు చెందిన షరోన్‌ రాజ్‌(23), గ్రీష్మ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు. నాగర్‌కోయిల్‌కు చెందిన ఓ సైనికుడితో వివాహం నిశ్చయం కావడంతో షరోన్‌ రాజ్‌తో తెగదెంపులు చేసుకోవాలని గ్రీష్మ నిర్ణయించుకుంది. అయితే ఇందుకు షరోన్‌ రాజ్‌ నిరాకరించడంతో అతడిని అంతం చేయాలని భావించింది. కుట్రలో భాగంగా తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా రామవర్‌మంచిరాయ్‌లోని తన ఇంటికి షరోన్‌ను తీసుకెళ్లిన గ్రీష్మ ఆయుర్వేద టానిక్‌లో క్రిమిసంహారక మందు కలిపి అతని చేత తాగించింది. శరీరంలోని వివిధ అవయవాలు పనిచేయకపోవడంతో 11 రోజుల తర్వాత 2022 అక్టోబర్‌ 25న దవాఖానలో షరోన్‌ మరణించాడు. షరోన్‌ హత్యను దశల వారీగా పూర్తి చేయాలని గ్రీష్మ కుట్ర పన్నినట్టు కోర్టు నిర్ధారించింది.

ప్రియుడిని చంపిన తర్వాత ఆమె ఆత్మహత్యాయత్నం చేయడం ఆమె నేర చరిత్రను వెల్లడిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ కేసులో దోషిగా తేలిన గ్రీష్మ అపార క్రిమినల్‌ మేధావని, ప్రియుడి హత్యకు ఆమె పకడ్బందీగా పథక రచన చేసిందని కోర్టు పేర్కొంది. తాను తప్పించుకోగలనని ఆమె నమ్మినప్పటికీ పోలీసు బృందం శాస్త్రీయ పద్ధతిలో చేసిన దర్యాప్తు ఆమె అరెస్టుకు దారితీసిందని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ తెలిపారు.

తనకు నేర చరిత్ర లేదని గ్రీష్మ చేసిన వాదనను కోర్టు తిరస్కరిస్తూ 2022 ఆగస్టు 22న పండ్ల రసంలో అధిక మోతాదులో పారాసిటమాల్‌ టాబ్లెట్లను కలిపి షరోన్‌ను విషంతో చంపాలని ఆమె అంతకు ముందు కూడా పథకం వేసిందని, అయితే పండ్ల రసం చేదుగా ఉండడంతో దాన్ని తాగడానికి నిరాకరించి షరోన్‌ చావును తప్పించుకున్నాడని ఆయన చెప్పారు. గ్రీష్మ చర్యలు సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపిస్తాయని, పవిత్రంగా భావించే ప్రేమకు కళంకం తెచ్చిపెడతాయని కోర్టు పేర్కొన్నట్టు ప్రాసిక్యూటర్‌ తెలిపారు. దీన్ని అత్యంత అరుదైన నేరంగా కోర్టు పరిగణించినట్టు ఆయన తెలిపారు.

Tags

Next Story