Uttarakhand: చమోలీ దుర్ఘటనలో 8కి చేరిన మృతులు

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. ఆదివారం మరో నలుగురి మృతదేహాల్ని ఆర్మీ సిబ్బంది వెలికితీసింది. దీంతో 60 గంటలపాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని రక్షణ శాఖ అధికారి మనీశ్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఘటనలో మొత్తం 54 మంది బీఆర్‌వో కార్మికులు గల్లంతయ్యారని, ఇందులో 46 మందిని రక్షించామని, 8 మంది చనిపోయారని చమోలీ కలెక్టర్ సందీప్ తివారీ చెప్పారు. గత శుక్రవారం బీఆర్‌వో క్యాంప్ వద్ద పెద్ద మంచుచరియలు విరిగిపడిన సంగతి తెలిసిందే.
ఈ ప్రమాదంలో 55 మంది కార్మికులు చిక్కుకున్నారు. దీనిపై సమాచారం తెలుసుకున్న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఈ ఘటనపై స్పందిస్తూ సహాయక చర్యలకు ఆదేశించారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు కంటైనర్ హౌస్‌లో ఉన్నారు. కానీ పెద్ద మంచు పర్వతం జారిపడడంతో వారు అందులోనే చిక్కుకున్నారు.
ఈరోజు హిమపాతం సంభవించిన మూడో రోజు తప్పిపోయిన నలుగురు కార్మికుల కోసం వెతకడానికి ఉదయం నుంచి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో వైమానిక దళం, ఇతర భద్రతా దళాలు కీలక పాత్ర పోషించాయి. సహాయక చర్యల కోసం ఎంఐ 17 హెలికాప్టర్, మూడు చీతా హెలికాప్టర్లు, రెండు రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్లను మోహరించారు. గాయపడిన వారికి చికిత్స కోసం ఎయిమ్స్ రిషికేశ్ నుంచి ఎయిర్ అంబులెన్స్‌ను కూడా సిద్ధం చేశారు. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, బాధితులను గుర్తించే కెమెరాలు, రోటరీ రెస్క్యూ రంపాలు, హిమపాతం రాడ్లు, డాగ్ స్క్వాడ్‌ల వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రెస్క్యూ ఆపరేషన్‌లో ఉపయోగించారు. ఈ క్రమంలో NDRF, SDRF, ఆర్మీ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ సహాయక చర్యలను పూర్తి చేశారు.
ఈ క్రమంలో ఆదివారం నాటికి హిమపాతంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మరణించారు. వారిలో నలుగురు రక్షించిన తర్వాత చికిత్స సమయంలో మరణించగా, ఆదివారం మరో నాలుగు మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం 46 మంది కార్మికులు సురక్షితంగా ఉన్నారు. ప్రమాదం జరిగిన రెండో రోజు శుక్రవారం 17 మందిని రక్షించగా, శనివారం 33 మందిని బయటకు తీసుకొచ్చారు. అయితే చిక్కుకున్న కార్మికుల సంఖ్య 55 కాగా, ఒక కార్మికుడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా శిబిరం నుంచి తన గ్రామానికి బయలుదేరాడని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
