DEEP FAKE: డీప్ ఫేక్‌కు చెక్..!

సెలబ్రిటీల క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ కొందరు కేటుగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఏఐ టూల్స్ ఉపయోగించి ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఫేక్ ప్రమోషన్లు వ్యాప్తి చేసి సామాన్యుల జేబులను కొల్లగొడుతున్నారు. వీటిని డీప్ ఫేక్ వీడియోలు అంటారు. ఇవి నిజమైన వీడియోలుగా కనిపిస్తాయి. కానీ పూర్తిగా ఫేక్. ఇలాంటి వీడియోలు చూసి చాలా మంది పెట్టుబడులు పెడుతున్నారు. బెట్టింగ్‌లు వేస్తున్నారు. రూ. లక్షల్లో నష్టపోతున్నారు. ఇలాంటి ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ డీప్ ఫేక్ వీడియోలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొస్తోంది.
ఏం జరుగుతోంది?
సోషల్ మీడియాలో బాలీవుడ్ స్టార్స్, బిజినెస్ టైకూన్స్, రాజకీయ నాయకులు చెప్పని మాటలు చెబుతున్నట్టు కనిపించే వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ డీప్‌ఫేక్ వీడియోలు కంప్యూటర్ లేదా మొబైల్ యాప్ తో తయారు చేసినవి. అచ్చం నిజం లాగా కనిపించే ఫేక్ కంటెంట్. ఇవి సామాన్యుల జీవితాలకు, సమాజానికి హాని చేస్తున్నాయి.
కొత్త రూల్స్ ఏమిటి?
డీఫ్ ఫేక్ కంటెంట్‌ను అరికట్టేందుకు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొత్త డ్రాఫ్ట్ రూల్స్ జారీ చేసింది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో AIతో తయారైన వీడియోలు, ఫోటోలపై స్పష్టమైన లేబుల్ ఉండాలి. ఇది స్క్రీన్‌లో కనీసం 10 శాతం స్పేస్ కవర్ చేస్తూ.. ఇది AIతో తయారైందని చూపించాలి. ఈ లేబుల్‌ను తొలగించడానికి వీలు లేకుండా ఉండాలి. యూజర్లు ఫేక్ కంటెంట్ అప్లోడ్ చేస్తే, అది AI తయారైందని చెప్పాలి. సోషల్ మీడియా కంపెనీలు ఆటోమేటెడ్ టూల్స్‌తో ఫేక్ కంటెంట్‌ను కనిపెట్టాలి.
కోర్టుకు వెళ్తున్న సెలబ్రిటీలు
నాగార్జున, అక్షయ్ కుమార్, రష్మికా మందన్నా, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు తమ ఫేక్ వీడియోలపై ఇప్పటికే కోర్టుకు వెళ్లారు. తమ ప్రమేయం లేకుండానే డీఫ్ ఫేక్ వీడియోలు తయారయ్యాయి. సోషల్ మీడియాలో వేగంగా వ్యాప్తి చెందాయి. ఒక సర్వే ప్రకారం.. 62 శాతం పెద్ద కంపెనీలు తమ ఎగ్జిక్యూటివ్‌ల డీప్‌ఫేక్ దాడులను ఎదుర్కొన్నాయి. భారత్‌లో దాదాపు 100 కోట్ల మంది ఆన్లైన్ యూజర్లున్నారు. ఫేక్ కంటెంట్ కార్చిచ్చులా వ్యాపిస్తోంది. ఎన్నికలు, పండుగల సమయంలో ఇవి హింసకు కూడా దారితీస్తాయి. ప్రభుత్వం AI టెక్నాలజీని అనుమతిస్తూనే, ప్రజలను మోసం నుంచి కాపాడాలని చూస్తోంది.
మార్పు మొదలైనట్లే..
తాజాగా కేంద్రం తీసుకోచ్చిన ఈ రూల్స్ ఆన్లైన్ కంటెంట్‌లో పారదర్శకత తెస్తాయి. ప్రజలు తాము చూసే వీడియోలు అసలువేనా లేదా ఫేకా అని తెలుసుకుని సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ, గూగుల్, మెటా వంటి పెద్ద కంపెనీలతో పాటు చిన్న ప్లాట్‌ఫారమ్‌లు ఈ రూల్స్‌ను ఏమేరకు అమలు చేస్తాయనేది చాలా కీలకం. అయితే ఈ ఈ రూల్స్ ఇంకా డ్రాఫ్ట్ దశలో ఉన్నాయి. చట్టం కాలేదు. 2025 ప్రజలు నవంబర్ 6 వరకు తమ అభిప్రాయాలు చెప్పవచ్చు. ఆ తర్వాత ఇవి చట్టంగా మారొచ్చు. డీప్‌ఫేక్ సమస్యను తీవ్రంగా తీసుకున్న తొలి దేశాల్లో భారత్ ఒకటి. చైనా, యూరోపియన్ యూనియన్‌లో ఇలాంటి రూల్స్ ఉన్నాయి. కానీ ఇంత సమగ్రంగా లేవు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

