Air Pollution: ఢిల్లీలో పూర్తిగా క్షీణించిన గాలి నాణ్యత..

దేశ రాజధాని ఢిల్లీలో ప్రమాద ఘంటికలు కొనసాగుతున్నాయి. రోజు రోజుకు వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ రోజు (ఆదివారం) ఉదయం ఐదు గంటలకు ఢిల్లీలో గాలి నాణ్యత పూర్తిగా క్షీణించిపోయింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 500 పాయింట్లుగా నమోదై కాలుష్య తీవ్రత రికార్డు స్థాయికి వెళ్లిపోయింది. గాలి కాలుష్యానికి తోడు ఢిల్లీ నగరం అంతటా దట్టమైన పొగ మంచు కమ్మేయడంతో విజిబిలిటీ తగ్గిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇక, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 507 పాయింట్లకు చేరితే ప్రమాదకర స్థాయి కాలుష్యంగా అధికారులు పరిగణిస్తారు. ఈ గాలి పీల్చితే ప్రజలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. ఏక్యూఐ 500 పాయింట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి 65 రెట్లు ఎక్కువ కావడం గమనార్హంగా చెప్పొచ్చు. అయితే, శనివారం రాత్రి 9 గంటలకు 327గా ఉన్న ఏక్యూఐ కేవలం 10 గంటల్లో ఆదివారం ఉదయానికల్లా 500 పాయింట్లు దాటడం ఢిల్లీ వాసులను తీవ్ర కలవరపరుస్తోంది.
గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు. అయితే, గత కొంతకాలంగా ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాదకరంగా మారుతోన్న విషయం తెలిసిందే. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలపెట్టడానికి తోడు.. మంచు రాజధానిని కమ్మేయడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. కాలుష్య నియంత్రణకు పాలకులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. రోజురోజుకూ గాలి నాణ్యత క్షీణిస్తోంది. ఈ కారణంగా నగర వాసులు తీవ్ర అనారోగ్య సమసల్యకు గురికావాల్సి వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com