Delhi Air Pollution: నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం కొంత అదుపులోకి వచ్చింది. నిన్నమొన్నటితో పోలిస్తే.. సోమవారం కొంచెం మెరుగుపడినట్లు నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రమాదకర వాయుకాలుష్యం కారణంగా మూతపడిన పాఠశాలలు, కళాశాలలు తెరుచుకున్నాయి. అయితే క్రీడలు, ప్రార్థనలు వంటి బహిరంగ సమావేశాలపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు. పేలవమైన వాయునాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) కారణంగా.. ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 9 నుండి 18 వరకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాలలకు వెళ్లే సమయంలో కాలుష్యం బారిన పడకుండా తల్లిదండ్రులు, పిల్లలు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ కోరారు.
గాలి దిశ, వేగంలో మార్పు కారణంగా గాలి నాణ్యత తక్కువ కేటగిరీలో వచ్చింది. అయినప్పటికీ ఢిల్లీ వాతావరణం ప్రమాదానికి చేరువలోనే ఉంది. నవంబర్ 20 సోమవారం ఉదయం 6 గంటలకు ఢిల్లీలోని ఆనంద్ విహార్‌లో AQI స్థాయి 364 నమోదైంది. ఇక ద్వారకా సెక్టార్ 8 వద్ద 358, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 314, ముండ్కా వద్ద 386 నమోదయ్యాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) డేటా ప్రకారం.. సోమవారం ఉదయం ముండ్కాలో 384, బవానాలో 417, పంజాబీ బాగ్‌లో 403 AQI నమోదైంది. కాగా జహంగీర్‌పురిలో 401, ఆనంద్ విహార్‌లో 364, వజీర్‌పూర్‌లో 399, నరేలాలో 374, ఆర్‌కెపురంలో 348, ఐటీఓలో 322గా AQI నమోదైంది. ఢిల్లీలో కాలుష్య స్థాయి పూర్ విభాగంలోనే ఉంది. ఢిల్లీలో వాతావరణంలో కొంత మెరుగుదలతో గ్రూప్ 4 పరిమితులు ఎత్తివేశారు. అదే సమయంలో అన్ని పాఠశాలలు నేటి నుంచి తెరవనున్నారు.
గాలి నాణ్యత మెరుగుపడటంతో గ్రూప్ 4 కింద విధించిన ఆంక్షలను ఢిల్లీ ప్రభుత్వం శనివారం ఎత్తివేసింది. AQI స్థాయి పెరగకపోవడంతో ఎయిర్ క్వాలిటీ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ప్రస్తుతానికి గ్రూప్ 1 నుంచి 3 వరకు ఆంక్షలు పూర్తిగా అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాజధానిలో వాయు కాలుష్యం కారణంగా నవంబర్ 9 నుంచి నవంబర్ 18 వరకు శీతాకాల సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల తర్వాత అన్ని పాఠశాలలు ఇప్పుడు నవంబర్ 20 నుంచి తెరుచుకోనున్నాయి. అంతకుముందు గాలి నాణ్యత అత్యంత తక్కువ ఉన్నందున నవంబర్ 3 నుంచి నవంబర్ 10 వరకు సెలవులు ప్రకటించడంతో పాటు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com