Delhi Assembly Election 2025: జోరుగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Delhi Assembly Election 2025: జోరుగా ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్
X
రాజధానిలోని మొత్తం 70 నియోజకవర్గాలలో పోలింగ్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. 1.56 కోట్ల మందికిపైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లని 13,766 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రజలు ఓట్లు వేయనున్నారు. 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ ఉవ్విళ్లూరుతుండగా, 25 ఏండ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ గద్దెనెక్కాలని బీజేపీ భావిస్తున్నది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ గెలవని కాంగ్రెస్‌.. ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తున్నది. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎన్నికల అధికారులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 220 కంపెనీల పారా మిలటరీ దళాలు, 35 వేల మంది ఢిల్లీ పోలీసులు, 19 వేల మంది హోంగార్డులను పోలింగ్‌ భద్రత కోసం వినియోగిస్తున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్‌లోని మిల్కిపూర్‌‌, తమిళనాడులోని ఈరోడ్‌ (ఈస్ట్‌) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానమైన మిల్కిపూర్‌ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్‌ ప్రసాద్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఫైజాబాద్‌ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపఎన్నిక పోలింగ్‌ బుధవారం జరుగుతున్నది. నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉన్నారు. 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొన్నది.

ఇక కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మృతితో తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉపఎన్నిక జరుగుతున్నది. డీఎంకే తరఫున వీసీ చంద్రకుమార్‌ పోటీచేస్తుండగా, అన్నాడీఎంకే, బీజేపీలు ఆయనకు సవాల్‌ విసురుతున్నాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2.28 లక్షలమంది ఓటర్లు ఉన్నారు. ఢిల్లీ అసెంబ్లీతోపాటు ఉపఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8న వెలువడనున్నాయి.

Tags

Next Story