Farmers Protest: ఢిల్లీకి దూసుకొస్తున్న రైతులు..హస్తినలో హైటెన్షన్

రైతులు ఈ రోజు ఛలో ఢిల్లీ చేపడుతున్నారు. దీంతో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు.సరిహద్దుల్లో హైఅలర్ట్ ప్రకటించారు.కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడంతోపాటు పలు ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం రైతు సంఘాలు మంగళవారం నిర్వహించ తలబెట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్‌తో రాజధాని హస్తినలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 2020-21 మధ్య ఏడాదికి పైగా సాగిన రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీలో ఏకంగా నెల రోజులపాటు 144 సెక్షన్ విధిస్తున్నట్టు ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఎక్కువ మంది గుమిగూడటం, ర్యాలీలు చేయడం, సమావేశాలు నిర్వహించడం, బ్యానర్లు ప్రదర్శించడం, నినాదాలు చేయడం, జనాలను ఎక్కించుకొని ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశించడంపై నిషేధం విధించారు. అలాగే ఇటుకలు, రాళ్లు, యాసిడ్ వంటి ప్రమాదకరమైన ద్రవ పదార్థాలు, పెట్రోల్, సోడా నీళ్ల బాటిళ్లు వంటి వాటిని వెంట తీసుకురావడంతోపాటు లౌడ్‌స్పీకర్ల వినియోగంపైనా నిషేధించారు. రైతుల ఆందోళన దృష్ట్యా ఢిల్లీ, చండీగఢ్‌లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
రైతుల నిరసనలను విరమింపజేసేందుకు ఇప్పటికే కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపారు. చండీగఢ్‌లోని సెక్టార్ 26లోని మహాత్మా గాంధీ స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో సమావేశం నిర్వహించారు. రైతు నాయకులతో కేంద్రమంత్రులు కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చించారు. రైతులపై నమోదైన కేసుల ఉపసంహరణ, నకిలీ విత్తనాలు, రసాయనాలకు కఠిన శిక్ష అంశాలపై రైతులకు సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటామని ఇప్పటికే మంత్రులు అంగీకరించారు. పంటలకు మద్దతు ధర, ఎమ్మెస్పీ కోసం కేంద్రం వేసిన కమిటీలో రైతులకి స్థానం సహా రైతు సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తున్నాయి రైతు సంఘాలు. వ్యవసాయ చట్టాల రద్దు సందర్భంగా కేంద్రం రైతులకిచ్చిన డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీలో మంగళవారం నిరసన తెలుపుతామని రైతు సంఘాలు చెప్పాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకొనేందుకు సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల ప్రవేశ పాయింట్ల వద్ద సిమెంట్ బారికేడ్లు, ఇనుప కంచెలు, మేకులు, కంటెయినర్లతో బహుళ అంచెల బారికేడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు పరిస్థితిని సమీక్షించేందుకు సింఘూ సరిహద్దు వద్ద ఒక తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com