Delhi Assembly: ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..

దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా (Rekha Gupta) గత వారం బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఇవాళ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం అయ్యింది. ఇవాళ ఉదయం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. అంతకంటే ముందు బీజేపీ ఎమ్మెల్యే అర్విందర్ సింగ్ లవ్లీని ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకున్నారు. ఉదయం రాజ్ నివాస్‌లో ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ముందుగా ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేశారు. ఆ తర్వాత మంత్రులు, కొత్తగా ఎన్నికైన సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత లంచ్ విరామం ఉంటుంది. ఆ తర్వాత మధ్యహ్నం 2 గంటలకు సభ మొదలవగానే బీజేపీ ఎమ్మెల్యే విజేందర్ గుప్తాను స్పీకర్‌గా ఎన్నుకోనున్నారు.
ఇక ఢిల్లీ అసెంబ్లీ ప్రతిపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిషి ఎన్నికయ్యారు. సమావేశాలకు ముందు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను గౌరవిస్తామని.. ప్రజల గొంతుకగా బాధ్యతను నెరవేరుస్తామని చెప్పారు. తొలి కేబినెట్ సమావేశంలోనే మహిళలకు రూ.2,500 పథకం అమలు చేస్తామని ప్రధాని మోడీ అన్నారని.. ఇదే విషయంపై అసెంబ్లీలో ప్రస్తామని చెప్పారు. హామీల అమలు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు పని చేస్తారని గుర్తుచేశారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిందంటూ బీజేపీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందని.. ఇలాంటి విధానాన్ని తిప్పికొడతామని అతిషి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com