Delhi cold: ముందంతా కాలుష్యం.. ఇప్పుడేమో చలి.. వణుకుతున్న ఢిల్లీ

మొన్నటి వరకు వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ వాసులు ఇప్పుడు వణికిపోతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రాజధానిలో చలి పెరిగింది. బుధవారం ఉదయం ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ లో 4.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ సీజన్ లో ఇదే అతి తక్కువని తెలిపింది. మంగళవారం 8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఒక్కరోజులోనే 3 డిగ్రీలు పడిపోవడంతో చలి తీవ్రంగా పెరిగింది. బుధవారం తెల్లవారుజామున 5:30 గంటల ప్రాంతంలో ఓవరాల్ గా ఢిల్లీలో 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని ఐఎండీ పేర్కొంది.
మరోవైపు, ఢిల్లీలో గాలి నాణ్యత ఇంకా పూర్ కేటగిరీలోనే ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. కాలుష్య పొగమంచు ఢిల్లీని దట్టంగా కప్పేసిందని చెప్పారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (సీపీసీబీ) వివరాల ఆధారంగా ఢిల్లీలో బుధవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 209 పాయింట్లుగా నమోదైంది. ఉదయం 7 గంటలకు వివిధ ఏరియాలలో ఏక్యూఐ ఎలా ఉందంటే.. ఆనంద్ విహార్ లో 218, అశోక్ విహార్ లో 227, ద్వారకలో 250, ఎయిర్ పోర్ట్ ఏరియాలో 218 పాయింట్లుగా నమోదైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com